ఐటీడీఏలు ఎత్తివేసేందుకు కుట్ర

4 Oct, 2016 00:36 IST|Sakshi
ఐటీడీఏలు ఎత్తివేసేందుకు కుట్ర
  • ప్రొఫెసర్లు నారాయణ, నాగేశ్వర్‌రావు
  • ములుగు చేరిన ‘ఆదివాసీ జిల్లా యాత్ర
  •  
    ఏటూరునాగారం : తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీలను విచ్ఛిన్నం చేయడమే కాకుండా, వారి అభివృద్ధికి ఏర్పాటుచేసిన ఐటీడీఏలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఏజెన్సీ ప్రాంతాల పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఈసం నారాయణ, ఓయూ ప్రొఫెసర్‌ అప్క నాగేశ్వర్‌రావు విమర్శించారు. ఆదివాసీ ప్రాంతాలతో జిల్లాలో ఏర్పాటుచేయాలనే డిమాండ్‌తో ఆదిలాబాద్‌ జిల్లా జోడేఘాడ్‌ నుంచి సమితి ఆధ్వర్యాన చేపట్టిన చైతన్య బస్సుయాత్ర సోమవారం మండల కేంద్రానికి చేరుకుంది.
     
    ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాంగణలోని కొమురం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నారాయణ, నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ తెలంగాణలోని ఆదివాసీలు, రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం హైదరాబాద్‌లో పెడితే ఒక్క రాజకీయ పార్టీ హాజరు కాలేదన్నారు. అయితే, భూభాగాన్ని రక్షించుకోవాడానికి ప్రాణ త్యాగాలకైన వెనుకాడేది లేదన్నారు. ఐటీడీఏ కింద ఉన్న ఏజెన్సీ మండలాలను మరో జిల్లాలో కలిపి ఐటీడీఏ నిర్వీర్యం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.ప్రజల అభిష్టానం మేరకు జిల్లాలను ఏర్పాటు చేయిస్తామని ప్రకటించిన కేసీఆర్‌ ఆదివాసీల ప్రజల అభీష్టం మేరకు ఐటీడీఏ ఉన్న ప్రాంతాలను ఆదివాసీ జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కాగా, ప్రత్యేక ఆదివాసీ జిల్లాల ఏర్పాటు కోసం ఈనెల 7న హైదరాబాద్‌లో చేపట్టిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున గిరిజనులు తరలిరావాలని రిటైర్డ్‌ డిప్యూటీ ఇంజనీర్‌ మెట్ల పాపయ్య పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం ఉభయరాష్ట్రాల అధ్యక్షుడు మైపతి అరుణ్‌తో పాటు మైపతి సంతోష్‌, కొప్పుల రవి, సమ్మారావు, చెంచయ్య, తల్లడి నాగేశ్వర్‌రావు, కొర్నిబెల్లి రాఘవరావు, నల్లబోయిన సమ్మయ్య, పొలెబోయిన గోపాల్‌ పాల్గొన్నారు. 
     
    03 ఎంయూఎల్‌ 102 - కార్యక్రమంలో మాట్లాడుతున్న ఈసం నారాయణ, నాగేశ్వర్‌రావు 
మరిన్ని వార్తలు