బ్యాంకులకు రికవరీ భయం

12 Dec, 2016 14:22 IST|Sakshi
బ్యాంకులకు రికవరీ భయం
పెద్దనోట్ల రద్దుతో దుస్థితి 
ఇచ్చిన రుణాలు రికవరీ కాక ఆందోళన  
 
భీమవరం : పెద్దనోట్ల రద్దుతో బ్యాంకులకు రికవరీ భయం పట్టుకుంది. ఇటీవల వరకూ జిల్లాలో చేపలు, రొయ్యలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు జోరుగా సాగాయి. రాష్ట్ర విభజన అనంతరం ప్రధానంగా డెల్టాప్రాంతంలోని భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు తదితర ప్రాంతాల్లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం ఆకాశమే హద్దుగా సాగింది.  ఫలితంగా భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.   ప్రధాన రోడ్లు వెంబడి ఎకరం వరి పొలం రూ.మూడు కోట్లపైబడి ధర పలికింది. ఇక మెరక భూముల ధరలకైతే పట్టపగ్గాలే లేవు. అపార్ట్‌మెంట్లకూ, ఇళ్లకూ మార్కెట్‌ ధర పెరిగిపోయింది. దీంతో బ్యాంకర్లు భూములు, ఇళ్ల తనఖాపై  అధిక మొత్తాలను రుణాలుగా ఇచ్చారు. దీనిని ఆసరాగా తీసుకుని కొందరు బినామీ వ్యక్తులు కూడా రుణాలు తీసుకున్నారు. కొందరు నకిలీ పత్రాలు చూపి, తక్కువ ఖరీదు కలిగిన భూములకు ఎక్కువ మొత్తంలో రుణాలు పొందారు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు  బ్యాంకు అధికారులను మచ్చిక చేసుకుని రుణాలు పొందారు.  భీమవరంలో ఓ రొయ్యల చెరువు యజమాని ఊరు, పేరు తెలియని 12 మంది వ్యక్తుల పేరున కేవలం రూ. మూడు కోట్ల విలువచేసే భవనం తనఖాపై ఏకంగా రూ.11 కోట్లు రుణం తీసుకున్న వైనం గత నెలలో ’సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
బ్యాంకర్లలో వణుకు 
 ప్రస్తుతం పెద్దనోట్ల రద్దుతో బంగారం, వెండి ధరలతోపాటు భూములు, భవనాల ధరలూ గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు నిబంధనలు మారడం, కొనుగోలు చేసిన భూములు, భవనాలకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉండడంతో   క్రయ, విక్రయాలూ తగ్గిపోయాయి. రానున్న రోజుల్లో భూముల ధరలు మరింత పడిపోతాయని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో భూములకు అధికమొత్తాల్లో రుణాలు ఇచ్చిన బ్యాంకర్లలో వణుకు మొదలైంది. రుణాలు రికవరీ కావనే ఆందోళన నెలకొంది. తామిచ్చిన రుణాలు ఎలా రికవరీ చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఇప్పటికే బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో బ్యాంకులో కుదువపెట్టిన బంగారాన్ని తక్షణం విడిపించుకోవాలని బ్యాంకు సిబ్బంది రుణగ్రహీతలకు నోటీసులు జారీ చేస్తున్నారు.భూములు, భవనాలపై ఇచ్చిన రుణాల రికవరీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.  
 
 
 
>
మరిన్ని వార్తలు