బోరుబావులకు కనెక‌్షన్లు ఇప్పించండయ్యా

11 Sep, 2017 22:55 IST|Sakshi
బోరుబావులకు కనెక‌్షన్లు ఇప్పించండయ్యా
 •  ‘మీ కోసం’లో కంబదూరు మండలం తిమ్మాపురం రైతుల వేడుకోలు
 •  

  అనంతపురం రూరల్‌: ‘ఉపాధి లేక అవస్థలు పడుతున్నాం. బోరుబావులకు విద్యుత్‌ కనెక‌్షన్లు ఇప్పించండయ్యా’ అంటూ కంబదూరు మండలం ఎన్‌.తిమ్మాపురం గ్రామానికి చెందిన రైతులు సోమవారం రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన మీకోసంలో కలెక్టర్‌ వీరపాండియన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 120 మంది రైతులం బోర్లు తవ్వుకున్నామని, నీరు సమృద్ధిగా పడినా అధికారులు విద్యుత్‌ కనెక‌్షన్లు మంజూరు చేయలేదని ఆయన దృష్టికి తెచ్చారు. వాల్టా చట్టాన్ని అతిక్రమించి బోర్లు తవ్వుకున్నారని, కనెక‌్షన్‌ ఇచ్చేది లేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి తిరుగుతున్నా కనికరించడం లేదని వాపోయారు. విద్యుత్‌ కనెక‌్షన్లు మంజూరు చేస్తే వ్యవసాయం చేసుకుంటామని కలెక్టర్‌ను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణరెడ్డి, గంగప్ప, నరసింహప్ప, ఆంజనేయులు, రాము, నాగభూషణంతోపాటు అనేకమంది రైతులు పాల్గొన్నారు. కాగా, జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి జాయింట్‌ కలెక్టర్లు రమామణి, ఖాజామొహిద్దీన్, డీఆర్‌ఓ మల్లీశ్వరిదేవి వినతులు స్వీకరించారు. వాటిలో కొన్ని...

  •  ఇదివరికే 100 రోజులు పని పూర్తి చేసుకున్న కూలీలకు అదనంగా మరో 100 రోజులు పని కల్పించే దిశగా చొరవ చూపాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కేశవరెడ్డి, క్రిష్ణమూర్తి, మల్లికార్జున కోరారు.
  •  రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని భవన నిర్మాణ పనులు చేపడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ భూమిరెడ్డి సావిత్రమ్మ ఫిర్యాదు చేశారు.
  •  దాసరి కులస్తులకు కొన్ని మండల కేంద్రాల్లో బీసీ ఏ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దాసరి సంక్షేమ సంఘం నాయకులు సురేష్‌బాబు, వెంకటరమణ కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు.
  • గ్రామ రెవెన్యూ అధికారులకు సీనియర్‌ సహాయకులుగా పదోన్నతి కల్పించాలని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు పాటిల్‌ విజయ్‌కుమార్‌రెడ్డి, పెద్దన్న కోరారు.
  • ఎస్సీ కార్పొరేషన్‌ కింద గొర్రెల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని రొద్దం మండలానికి చెందిన పలువురు రైతులు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వార్తలు