ప్రత్యేక హోదా సాధన కోసం..

7 Oct, 2015 04:17 IST|Sakshi
ప్రత్యేక హోదా సాధన కోసం..

నేటి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష
♦ కీలకదశకు చేరుకున్న ప్రత్యేక హోదా సాధన ఉద్యమం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రగతికి, భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా సాధనకోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం ఉధృతం చేశారు. గడిచిన ఏడాదిన్నర కాలంగా హోదా కోసం వివిధ రకాల ఆందోళనలు నిర్వహిస్తున్న జగన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత ఒత్తి డి పెంచడానికి బుధవారం నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్నారు. గుంటూరు శివార్లలోని నల్లపాడు వద్ద ఏర్పాటు చేసిన శిబిరం ఇందుకు వేదిక కానుంది. పార్లమెంట్‌లో విభజన చట్టం చేసిన సందర్భంలో ఇచ్చిన హామీ ల్లో ప్రధానమైంది ప్రత్యేక హోదా. విభజన చట్టంలో ఇచ్చిన హామీలతోపాటు హోదా అం శం ఏడాదిన్నర కాలంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రంపై ఎలాంటి ఒత్తిళ్లు లేకపోవడంతో కేంద్రం కూడా కిమ్మనడంలేదు. దీంతో రాష్ట్ర అభివృద్ధికి సంజీవని అయిన ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ నడుం బిగించి పోరాటం చేస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనూ హోదా సాధనలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడమే కాకుండా కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి పట్టుబట్టి శాసనసభ ద్వారా ఏకగ్రీవ తీర్మానం చేయించింది. అదే క్రమంలో ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 25లోగా స్పందించని పక్షంలో 26 నుంచి నిరవధిక దీక్షకు దిగుతానని జగన్ హెచ్చరించారు.

ఆ మేరకు గుంటూరులోని ఉల్ఫ్ హాలులో తలపెట్టిన దీక్షకు పోలీసుల ద్వారా చంద్రబాబు అనేక రకాలుగా ఆటంకాలు కల్పించిన సంగతి తెలిసిందే. దీక్షకు అనుమతివ్వకపోగా అనేక ఆంక్షలు విధించారు. నిరవధిక దీక్షకోసం ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. భారీ ఎత్తున పోలీసులను మోహరించి అడ్డుపడ్డారు. దీక్షా శిబిరం వేదిక మార్చుకోవాలని కట్టడి విధించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ హైకోర్టును సైతం ఆశ్రయించింది. అయితే ప్రత్యేక హోదా సాధించడమే అంతిమ లక్ష్యంగా సర్కారుతో సంఘర్షణకు తావివ్వకుండా సంయమనం పాటించిన వైఎస్సార్ కాంగ్రెస్ తన పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించి దీక్ష తేదీని ఈ నెల 7 వ తేదీకి మార్చుకుంది. అదే క్రమంలో దీక్షా స్థలాన్ని నల్లపాడు రోడ్డుకు (మిర్చియార్డుకు సమీపంలో) మార్చుకుంది. ఇప్పుడీ వేదికపై జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు.

 దీక్షకు ఏర్పాట్లు పూర్తి
 సాక్షి ప్రతినిధి, గుంటూరు: ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నుంచి గుంటూరులో చేపట్టనున్న నిరవధిక నిరాహారదీక్షకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సత్తెనపల్లి రోడ్డులోని మిర్చియార్డుకు సమీపంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం ఏర్పాట్లను మంగళవారం పార్టీ సీనియర్ నేతలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సాధనకు వైఎస్ జగన్ చేపడుతున్న దీక్షకు రాష్ట్రవాప్తంగా వివిధ వర్గాలు పెద్ద ఎత్తున సంఘీభావం వ్యక్తం చేశాయి. విద్యార్థి, వర్తక, వాణిజ్య, ప్రజా సంఘాలు దీక్షకు సంఘీభావాన్ని ప్రకటించాయి.

విద్యార్థి సంఘాలు కళాశాలల్లో సమావేశాలు నిర్వహించి ప్రత్యేక హోదాపై విద్యార్థులకు అవగాహన కలిగించాయి. కరపత్రాలు పంపిణీ చేశాయి. ఇక పార్టీ శ్రేణులు గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించి దీక్ష వద్దకు తరలిరావడానికి ప్రణాళికను రూపొందించుకున్నాయి. ఈ స్పందనకు అనుగుణంగా దీక్షా శిబిరం వద్ద నాయకులు ఏర్పాట్లు చేశారు. గత నెల 26న చేపట్టాలనుకున్న దీక్షకు ప్రభుత్వం ఆటంకాలు కలిగించినప్పటికీ, రెట్టించిన ఉత్సాహంతో పార్టీ నేతలు ఈసారి ఏర్పాట్లు చేశారు.

 వేదికకు ఇరువైపులా ఎల్‌ఈడీ స్క్రీన్‌లు
 దాదాపు 200 మంది నాయకులు ఆసీనులు కావడానికి అనువుగా వేదికను ఏర్పాటు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, ఇతర సీనియర్ నాయకులు ఈ వేదికపై ఆసీనులవుతారు. దూరం నుంచి కూడా దీక్షా కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేదికకు ఇరువైపులా ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిలు వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలను ప్రదర్శించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ ప్రదర్శించనున్నారు.

సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శిబిరానికి సమీపంలో ఐదు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కాకుండా పర్యవేక్షిస్తున్నారు. కార్యకర్తల వాహనాల పార్కింగ్‌కు రెడ్డి కళాశాలలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. వీఐపీలకు శిబిరానికి సమీపంలోనే పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు దీక్షాస్థలి వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు.
 
 దుర్గమ్మ ఆశీస్సులతో...
 నిరవధిక నిరాహార దీక్ష కోసం ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 9 గంటలకు విజయవాడ చేరుకుంటారు. 9.30 గంటలకు కనకదుర్గమ్మ ఆశీస్సులు పొందుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 10.30 గంటలకు గుంటూరు జిల్లాలో నల్లపాడు రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన దీక్షా స్థలానికి చేరుకుంటారని పార్టీ కార్యక్రమాల రాష్ట్ర కమిటీ ప్రధానకార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు.
 
 ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా....
  ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాం డ్‌పై వైఎస్ జగన్ ఏడాదిన్నర కాలంగా అనేక రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. మరోవైపు ఈ అంశంపై ప్రజలను గందరగోళపరిచే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించిన తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టారు. గత ఏడాదిన్నర కాలంలో వైఎస్సార్‌సీపీ సాగించిన పోరాట క్రమమిదీ...
► 19 మే 2014: ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ ఢిల్లీలోని గుజరాత్ భవన్‌లో కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి సహకరించాలని, విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చాలని కోరారు.
► 12 జూన్: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి కనీసం 20 ఏళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించాలని లోక్‌సభలో ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
► 5 డిసెంబర్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు.
► 31 జనవరి 2015: డిమాండ్ల సాధనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో రెండ్రోజుల పాటు జగన్ దీక్ష చేశారు.
►15 ఫిబ్రవరి: ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను కలిసి విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని, ప్రత్యేక హోదా కల్పించాలని కోరారు.
►16 మార్చి: లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చలో ఏపీకి తక్షణం ప్రత్యేక హోదా కల్పించాలని పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు.
►30 మార్చి: ప్రత్యేక హోదా ఇవ్వడంతోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆధారపడి ఉందని, కేంద్రం ఇచ్చిన హామీలను వెంటనే అమలు
►31 మార్చి: కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీని కలిసి హోదా, విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జగన్ నేతృత్వంలోని బృందం విన్నవించింది.
► 12 ఏప్రిల్: హోదా కోరుతూ పార్లమెంట్‌లోనూ, పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పార్టీ ఎంపీల ఆందోళన.
► 15 ఏప్రిల్: జాతీయ ప్రాజెక్టుగా చేపడతామని హామీ ఇచ్చిన దరిమిలా పోలవరం ప్రాజెక్టును తక్షణం చేపట్టి పూర్తి చేయాలన్న డిమాండ్‌తో ప్రాజెక్టు సందర్శన (మూడు రోజుల యాత్ర)
► 3 జూన్-4 జూన్: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన తీరుపై, ప్రత్యేక హోదా సాధించలేక పోవడంపై మంగళగిరి వద్ద రెండు రోజులపాటు జగన్ సమరదీక్ష.
► 9 జూన్: రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే ఎంతో కీలకమైన పార్లమెంట్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా కల్పించేలా చూడాలని జగన్ నేతృ త్వంలోని ప్రతినిధి బృందం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిసి విన్నవించింది.
► 11 జూన్: ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్, ఆర్థిక మంత్రి జైట్లీలను కలిసి మరోసారి ఒత్తిడి.
► 10 ఆగస్టు: ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేస్తున్న కాలయాపనకు నిరసనగా, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల విషయాన్ని జాతీయస్థాయి దృష్టిని ఆకర్షించే విధంగా ఢిల్లీలో జగన్, పార్టీ నేతల ధర్నా. ర్యాలీగా పార్లమెంట్‌కు వెళుతుండగా జగన్‌తో సహా నేతల అరెస్ట్.
► 29 ఆగస్టు: హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ విజయవంతంగా రాష్ట్ర బంద్.
► 1 సెప్టెంబర్: హోదా కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం కోసం పట్టుబట్టడం. చివరకు తీర్మానం చేయించడం.
►15 సెప్టెంబర్: ప్రత్యేక హోదా ప్రజల ఆకాంక్ష, ఆవశ్యకత, పోరాటాలపై తిరుపతిలో నిర్వహించిన యువభేరి నుంచి జగన్ ప్రసంగం.  
►22 సెప్టెంబర్: హోదా సాధించే దిశగా విశాఖలో నిర్వహించిన యువభేరి నుంచి జగన్ దిశానిర్దేశం. అదే సమయంలో ఏపీ ప్రజల హక్కు అయిన హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ప్రకటన.

మరిన్ని వార్తలు