బాధితులకు బాసటగా

22 Nov, 2016 00:00 IST|Sakshi
బాధితులకు బాసటగా
 నేడు జిల్లాకు  జగన్‌ రాక
 85 రోజులుగా గ్రామాల్లో 144 సెక్షన్‌
 అధికారం బలంతో దౌర్జన్యం
 ఆది నుంచీ వైఎస్సార్‌ సీపీ, వామపక్షాల పోరాటం
 నర్సిపేటలో జగన్‌ బహిరంగ సభ 
సాక్షిప్రతినిధి, కాకినాడ : వారంతా అర ఎకరం, ఎకరం భూములు దుక్కి దున్ని సాగు చేసుకుని జీవితాలు వెళ్లదీస్తున్న వారే. రెక్కాడితే గాని డొక్కాడని రోజువారీ బడుగులే. అటువంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వం కత్తికట్టింది. వారి జీవనానికే ముప్పుతెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తోంది. తమకు జరిగే అన్యాయంపై ఆరు నెలలుగా రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలపై చంద్రబాబు సర్కార్‌ పోలీసులతో ఉక్కుపాదం మోపి నిర్థాక్షిణ్యంగా అణచివేస్తోంది. తుని నియోజకవర్గం తొండంగి మండలంలో ప్రతిపాదిత దివీస్‌ రసాయన పరిశ్రమ ఏర్పాటు కోసం సుమారు 505 ఎకరాలు బలవంతపు భూ సేకరణకు చంద్రబాబు సర్కార్‌ నిర్ణయించింది. ఆరు నెలలుగా ఈ బలవంతపు భూ సేకరణకు సిద్ధమవుతున్న సర్కార్‌ దివీస్‌ బాధిత దానవాయిపేట, పంపాదిపేట, తాటియాకులపాలెం, నర్సిపేట తదితర 13 గ్రామాల ప్రజలు ఆరు నెలలుగా అలుపెరగని పోరు సలుపుతున్నారు. ఇందుకు వారికి మిగిలింది పోలీసు కేసులు, అధికార పార్టీ నేతల వేంధిపులు, వారి అనుచరగణం చేసే దాడులతో అయిన గాయాలు. ఇలా దాదాపు ప్రతి గ్రామంలోనూ దివీస్‌కు వ్యతిరేకంగా గొంతెత్తితే చాలు పోలీసులు లాఠీలు ఝుళిపించి నరకం చూపిస్తున్నారు. ఆయా గ్రామాల్లో ప్రతి కుటుంబంలో ఒకరో ఇద్దరో పోలీసులు, అధికారపార్టీ పెద్దలు పురమాయించిన ప్రైవేటు సైన్యంతో నరకం కళ్ల చూసిన వారే.
అడుగడుగునా నిఘనే...
ప్రభుత్వం అంతటితోనే ఆగలేదు సుమారు 85 రోజులుగా ఆ గ్రామాల్లో 144 సెక్షన్‌ అమలుచేస్తున్నారు. కుటుంబ జీవనాధారమైన పొలాలను ప్రభుత్వం బలవంతంగా లాగేసుకునే ప్రయత్నాలపై కడుపు మండిన ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే అక్రమ కేసులతో లొంగదీసుకునే ప్రయత్నానికి తెగబడుతున్నారు. తమ భూములు తమకు వదిలేసి తమ మానాన తమను వ్యవసాయం చేసుకోనివ్వాలని కన్నీళ్లపర్యంతమై వేడుకుంటున్నా సర్కార్‌ కరుణించడం లేదు. పై పెచ్చు ప్రజల గొంతుకను నొక్కేస్తోంది.
.సెజ్‌ భూములు ఎందుకివ్వడం లేదు...
 ప్రతిపాదిత దివీస్‌ రసాయన పరిశ్రమకు సమీపాన కాకినాడ సెజ్‌లో 9,800 ఎకరాలు ఖాళీగా ఉంది. దివీస్‌ పరిశ్రమకు సెజ్‌లో భూములు కేటాయించవచ్చు. ముఖ్యమంత్రి చెబితే సెజ్‌ నుంచి దివీస్‌కు 500 ఎకరాలు కేటాయించడం పెద్ద విషయం కాదు. కానీ అసలు కిటుకు అక్కడే ఉంది. పేద రైతుల భూమలైతే పాతిక కోట్లుకు వచ్చేస్తుంది, అదే సెజ్‌లో కొనాలంటే రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టాలి. అందుకే చంద్రబాబు సర్కార్‌ నిరుపేదలు, బడుగులు భూములను బలవంతంగా లాక్కునైనా దివీస్‌కు కేటాయించాలని కంకణం కట్టుకుంది.
ఈ దివీస్‌ పరిశ్రమ కారణంగా వేలాది మంది మత్స్యకారులు, బడుగు వర్గాలను రోడ్డున పడేసేలా తీరంలో పెద్ద ఎత్తున ఉన్న హేచరీలను కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యంతో ప్రజల ప్రాణాలకే కాకుండా ఆ పరిసర ప్రాంతాల భూములు కూడా సారం కోల్పోయే ప్రమాదం ఉంది. పరిశ్రమ ఏర్పాటైతే పంటలు పండే పరిస్థితి పూర్తిగా కోల్పోతామని వారి ఆవేదన అరణ్య రోదనగానే మిగులుతోంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం తుని. మూడు దశాబ్థాలు రాజకీయంగా రామకృష్ణుడిని అందలమెక్కించిన ఆ ప్రాంత ప్రజలను నిలువునా ముంచేస్తున్నా ఆయన మాత్రం ఇంతవరకు పెదవి విప్పడం లేదు. రామకృష్ణుడు స్థానికంగా లేకున్నా నియోజకవర్గ వ్యవహారాలన్నీ దగ్గరుండి చక్కబెట్టే  వరుసకు సోదరుడైన కృష్ణుడు, అతని అనుచరగణం నిత్యం నరకం చూపిస్తున్నా పోలీసులకు చెప్పుకోలేని దౌర్భాగ్యం దివీస్‌ బాధిత గ్రామాల్లో కనిపిస్తోంది.
చలించి ... తరలివచ్చి...
బాధితుల తరఫున  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, వామపక్షాలు పోరాటం చేస్తూనే ఉన్నాయి. అందుకు అదే స్థాయిలో ప్రభుత్వం పోలీసులు కేసులు కూడా పెట్టించింది. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. బాధిత గ్రామాల్లో ప్రభుత్వం చిత్రహింసలకు గురిచేస్తున్న పరిస్థితులను ఎమ్మెల్యే రాజా ద్వారా స్వయంగా తెలుసుకుని చలించిపోయిన పార్టీ అ«ధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహ న్‌రెడ్డి  వారికి మనో ధైర్యం కల్పించేందుకు మంగళవారం బాధిత గ్రామాలకు వస్తున్నారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారు చేస్తున్న పోరాటానికి పూర్తి స్థాయిలో మద్ధతు ఇవ్వనున్నారు. అనంతరం వారిని ఉద్ధేశించి దానవాయిపేట శివారు నర్శిపేటలో జరిగే సభలో ప్రసంగించనున్నారు.
నేతల ఏర్పాట్లు పరిశీలన...
నర్సిపేటలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని సోమవారం రాత్రి పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,పార్టీ కార్యక్రమాల రాష్ట్ర కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, ప్రత్తిపాడు కోఆర్డినేటర్‌ పర్వత ప్రసాద్‌ తదితరులు పరిశీలించారు.
ఈ సందర్బంగా కన్నబాబు, రాజా మీడియాతో మాట్లాడుతూ జగన్‌మోహ న్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు వస్తారన్నారు. అక్కడి నుంచి అన్నవరం మీదుగా సాయంత్రం నాలుగు గంటలకు దానవాయిపేట శివారు నర్సిపేట రానున్నారని చెప్పారు. దివీస్‌ బాధితులతో నేరుగా మాట్లాడి వారి ఆవేదనను తెలుసుకుంటారని, అనంతరం వారిని ఉద్ధేశించి  ప్రసంగించనున్నారని తెలిపారు.
మరిన్ని వార్తలు