ఆమరణ దీక్ష భగ్నం.. జగ్గారెడ్డి అరెస్ట్

11 Aug, 2016 01:21 IST|Sakshi
ఆమరణ దీక్ష భగ్నం.. జగ్గారెడ్డి అరెస్ట్

సంగారెడ్డి మున్సిపాలిటీ: 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా సంగారెడ్డిలో బుధవారం దీక్ష తలపెట్టిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. జగ్గారెడ్డిని దీక్షా శిబిరానికి వెళ్తుండగానే అరెస్టు చేయడంతో ఆ ప్రాంతంలో కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలతో కలిసి శాంతియుతంగా రామ మందిర్ నుంచి ర్యాలీగా వెళ్తుంటే పోలీసులు అరెస్టు చేయడమే కాకుండా తమ కార్యకర్తలపై దాడులు చేశారని ఆరోపించారు.

2013 భూసేకరణ చట్ట ప్రకారం బాధితులకు పరిహారం చెల్లించడమే కాకుండా.. మూడేళ్లపాటు వారికి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం తీసుకొచ్చిన 123, 214 జీవోల ద్వారా రైతులు దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని, కమీషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం  2013 చట్టాన్ని పక్కనపెట్టిందని జగ్గారెడ్డి అన్నారు.

 
దీక్ష భగ్నం అప్రజాస్వామికం: ఉత్తమ్

సంగారెడ్డి రూరల్: మల్లన్నసాగర్ భూ బాధితుల కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేపట్టిన దీక్షను భగ్నం చేయడం అప్రజాస్వామికమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డిలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందన్నారు.   మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందన్నారు.

 

 

మరిన్ని వార్తలు