అవినీతికి చిరునామా ధవళేశ్వరం పంచాయతీ

12 Apr, 2017 23:12 IST|Sakshi
అవినీతికి చిరునామా ధవళేశ్వరం పంచాయతీ
కమర్షియల్‌ కాంప్లెక్స్‌లకు సాధారణ పన్నులు
పేదప్రజలపై భారీగా పన్నుల మోత
ఇంటి నిర్మాణ అనుమతుల్లోనూ భారీ అవకతవకలు
వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి
ధవళేశ్వరం : ధవళేశ్వరం పంచాయతీ అవినీతికి చిరునామాగా మారిందని వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. పార్టీ రాజమహేంద్రవరం రూరల్‌ కో–ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి బుధవారం ఆమె ధవళేశ్వరం పంచాయతీ కార్యాలయానికి చేరుకుని అక్కడి అవకతవకలపై కార్యదర్శి టి.శ్రీనివాసరావును నిలదీశారు. పంచాయతీ రికార్డులను పరిశీలించి డెత్‌ సర్టిఫికేట్‌ నుంచి ఇంటి పన్నుల వరకు ప్రతి దానిలోనూ అవినీతి పొంగిపొర్లుతోందని ఆరోపించారు. 48మంది పంచాయతీ కార్మికులను చూపిస్తున్నారని వీటిలోనూ భారీ అవకతవకలు జరిగాయన్నారు. లేనివారి పేరిట జీతాలు స్వాహా చేస్తున్నారని ఆమె విమర్శించారు. గ్రామంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, ఆశ్రమాలు, అపార్ట్‌మెంట్‌లు, థియేటర్లు, కాలేజీలు, ఫ్యాక్టరీలకు సాధారణ పన్నులు వేసి ప్రజలపై భారాన్ని వేశారని జక్కంపూడి ఆరోపించారు. కమర్షియల్‌ పన్నులు పడాల్సిన చోట సాధారణ పన్నులు వేసేందుకు ఎవరి వద్ద నుంచి ఎంతెంత వసూలు చేశారన్న వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఏడాదికి 500రూపాయలు కట్టే సామాన్య ప్రజలపై సుమారు 10రెట్లు భారం వేసి రూ.5వేలు వరకు పన్నులు పెంచేశారన్నారు. పంచాయతీ క్యాష్‌ బుక్‌లో ఫిబ్రవరి వరకే వివరాలు నమోదు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. బిల్డింగ్‌ ప్లాన్లకు సంబంధించి రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌కు ఇచ్చిన నకళ్లకు కార్యాలయంలో ఉన్న వాటికి సంబంధం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ట్రాన్స్‌ఫర్‌లు లేనప్పటికీ ఏవిధంగా చేశారని ప్రశ్నించారు. డెత్‌ సర్టిఫికేట్‌లకు సుమారు రూ.వెయ్యి వరకు గుంజుతున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి సొమ్మును ఇచ్చిన వారిని తీసుకువచ్చి చెప్పించారు. రూ.6వేలు కుళాయి పన్ను వసూలు చేస్తూ రూ.5వేలకు మాత్రమే రశీదు ఇస్తున్నారని ఆరోపించారు. సాల్వెన్సీ సర్టిఫికెట్‌ కోసం వచ్చిన వారి వద్ద నుంచి కూడా భారీగా సొమ్మును గుంజుతున్నారన్నారు. సీనియర్‌ ఎమ్మెల్యేనని చెప్పుకునే గోరంట్ల  నియోజకవర్గంలోనే భారీ అవినీతి చోటు చేసుకుంటోందన్నారు. ఎన్నికలకు ముందు మూడు నెలల్లో రూరల్‌ గ్రామాలకు ఎన్నికలు జరిపిస్తామని ఇచ్చిన హామీని తుంగలోకి తోక్కారన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని జక్కంపూడి విమర్శించారు. జన్మభూమి కమిటీల అవినీతితో వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ రూరల్‌ కో–ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ బిల్డింగ్‌ ప్లాన్లలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు. ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సుగుణానగర్‌లో 14శాతం కట్టించుకోవాల్సి ఉన్నప్పటికీ కట్టించుకోకుండా అనుమతులు ఏ విధంగా ఇచ్చారని ప్రశ్నించారు. ధవళేశ్వరం పంచాయతీలో చోటు చేసుకున్న భారీ అవినీతి అక్రమాలపై గురువారం కమిషనర్, సబ్‌ కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.  వైఎస్సార్‌ సీపీ నాయకులు సాధనాల చంద్రశేఖర్‌(శివ), గరగ శ్రీనివాసరావు, గోలి దేవకుమార్, షట్టర్‌ బాషా, దాసరి శివ, పిన్నమరెడ్డి సూర్యచంద్రం, చంటి, ఏజీఆర్‌ నాయుడు, గునిపె అశోక్, పందిళ్ల భానుప్రసాద్, కేతా సాయి, పుట్టా పరేష్‌నాథ్, సత్యం వెంకటరమణ, బర్రి కామేశ్వరరావు, ప్రశాంత్‌కుమార్, మిరప రమేష్, ఏలీషా జగన్, కపూర్, యర్రంశెట్టి శ్రీరామ్, ఆకుల సూర్యప్రకాష్, తోలేటి రాజా, బలరామ్, మోహన్‌బాబు, పిల్లి కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు