సమస్యలు చెబుతుంటే పోలీసులను ఉపయోగిస్తున్నారు..!

9 Nov, 2016 23:41 IST|Sakshi
సమస్యలు చెబుతుంటే పోలీసులను ఉపయోగిస్తున్నారు..!
వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి 
కూనవరం (సీతానగరం) : టీడీపీ చేపట్టిన జన చైతన్య యాత్రలో ప్రజలు తమ సమస్యలను చెబుతుంటే పోలీసులతో వారిని అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. బుధవారం కూనవరంలో చౌటిపల్లి లాల్‌బాబు ఇంటివద్ద జరిగిన విందు కార్యక్రమంలో రాజా పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుప మేరకు చేపట్టిన గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా జనచైతన్య యాత్రలు టీడీపీ చేపట్టిందన్నారు. గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమంలో టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 650  హామీలలో ఒకటి అమలు జరపలేదని ప్రజలు తమ వద్ద వాపోతున్నారని, ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జనచైతన్య యాత్రలో ప్రజలు స్పందించి, ఎక్కడకక్కడ ఖండిస్తుంటే పోలీసులతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాజమహేంద్రవరం రూరల్‌ కొంతమూరులో 90 ఇల్లు కాలిపోతే అక్కడకు వెళ్లిన ఎమ్మెల్యే బుచ్చియ్యచౌదరి వారే ఇళ్ల కాల్చుకున్నారని అనడం అధికారం అహంకారంతో ఉన్నారని రుజువైందన్నారు. రెండేళ్ళ క్రితం ఇళ్లను వేరే ప్రాంతంలో ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చిన బుచ్చియ్య చౌదరి దానిని మర్చారన్నారు. దేశంలో గత ప్రభుత్వంలో 47 లక్షల గృహాలు కడితే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ రాష్ట్రంలో 48 లక్షల ఇల్లు కట్టారని గుర్తు చేశారు. రెండేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టిన దాఖలాలు లేవన్నారు.
మోదీ ప్రకటనతో ప్రజల ఇబ్బందులు
ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జక్కంపూడి రాజా అన్నారు. చంద్రబాబు పట్టిసీమ, దేవుడు భూములు అమ్ముకున్న డబ్బు, అమరావతి ద్వారా సంపాదించిన నల్లదనాన్ని ఏవిధంగా మారుస్తావని ప్రశ్నించారు. పెద్దనోట్లు రద్దు చేయమని మేమే చెప్పామని టీడీపీ నాయకులు చంద్రబాబును తెగపొగుడుతుంటే, చంద్రబాబు మాత్రం ఇంటిలో కూర్చుని డబ్బులు ఏవిధంగా మార్చాల అని మదనపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వేల కోట్లు రూపాయల అవినీతి జరుగుతుందని, ప్రజలే త్వరలో గట్టిగా బుద్ధిచెబుతారని రాజా హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అద్యక్షుడు పెదపాటి డాక్టర్‌బాబు, రాష్ట్ర సేవాదళ్‌ కార్యదర్శి చళ్లమళ్ల సుజీరాజు, జిల్లా కమిటీ కార్యదర్శి వలవల వెంకట్రాజు, మండల సేవాదళ్‌ అద్యక్షుడు ఆళ్ళ కోటేశ్వరావు, బంక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు