అధికారుల తీరుపై జక్కంపూడి ధ్వజం

20 Mar, 2017 23:08 IST|Sakshi
అధికారుల తీరుపై జక్కంపూడి ధ్వజం
ఆలయ భూముల రికార్డులు తీసుకెళ్లడంపై ఆగ్రహం
కోరుకొండ : శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి చెందిన వివిధ రకాల రికార్డులను అన్నవరం దేవస్థానం అధికారులు తీసుకెళ్లడంపై రైతులు, ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. సోమవారం కోరుకొండలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడారు. అన్నవరం దేవస్థానం ఈఓ, స్థానిక ప్రజాప్రతినిధి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత కొన్నేళ్లుగా కోరుకొండ దేవస్థానంలో ఉన్న రైతులు, ప్రజలకు సంబంధించిన భూముల రికార్డులు, స్వామి వారి ఆస్తుల రికార్డులను ఎవరికీ సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లడంపై మండిపడ్డారు. చివరకు శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్పీ. రంగరాజభట్టార్‌ స్వామికి కూడా సమాచారం తెలియకపోవడంపై పలు అనుమానాలకు దారి తీస్తున్నాయన్నారు. గోకవరం మండలం భూపతిపాలెంలో గల స్వామివారికి చెందిన 1180 ఎకరాల భూమి వివరాల పట్టాలన్నీ తీసుకెళ్లడం చూస్తుంటే దీని వెనుక ఏదో దాగి ఉందని విజయలక్ష్మి అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోరుకొండ, శ్రీరంగపట్నం, కాపవరం, జంబూపట్నం గ్రామాలకు చెందిన పలువురు రైతుల భూములు రిజిస్ట్రేషన్‌ కాకుండా అన్నవరం దేవస్థానం వారు నిలుపుదల చేయడంపై గతంలో ఆందోళన చేయడం, అన్నవరం ఈఓకు వినతిపత్రం అందించామన్నారు. రెండున్నరేళ్లుగా రైతులు, ప్రజలకు చెందిన భూములను రిజిస్ట్రేషన్లు నిలిపివేయడానికి ఎలాంటి ఆధారం ఉందో తమకు వివరించాలని డిమాండ్‌ చేశారు.  రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన భూములు లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి చెందినవా, రైతులవా అని తెలియకుండా అన్నవరం దేవస్థానం అధికారులు ఏ హక్కుతో రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని ఆరోపించారు.  వెంటనే అన్నవరం అధికారులు రికార్డులను కోరుకొండకు తీసుకు రాకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు నక్కా రాంబాబు, గరగ మధు, తాడి హరిశ్చంద్ర ప్రసాద్‌రెడ్డి, వాకా నరసింహారావు, నీరుకొండ యుదిష్టర నాగేశ్వరరావు, అయిల శ్రీను, తిక్కిరెడ్డి హరిబాబు, దాసరి యేసు, గుగ్గిలం భాను తదితరులు ఉన్నారు. 
మరిన్ని వార్తలు