జల్సాలకు అలవాటు పడి చోరీ

17 Aug, 2016 00:12 IST|Sakshi
తణుకు : జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు చోరీకి పాల్పడి పోలీసులకు పట్టుబడ్డాడు. మంగళవారం అతనిని తణుకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి పదకొండున్నర కాసుల బంగారు ఆభరణాలు ఓ ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను పట్టణ పోలీసు స్టేషన్‌లో సీఐ చింతా రాంబాబు విలేకరులకు వివరించారు. ఆయన కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జల్లా అమలాపురానికి చెందిన దామిశెట్టి పవన్‌కుమార్‌ డిగ్రీ చదువుతున్నాడు. తణుకులో అతని సోదరి నివాసం ఉంటోంది. ఆ ఇంటి పక్కనే తారపురెడ్డి త్రినాథస్వామి నివాసం ఉంటున్నారు.  ఈ క్రమంలో ఈ ఏడాది మేలో తణుకు వచ్చిన పవన్‌కుమార్‌ అక్క ఇంట్లో కొన్నాళ్లు ఉన్నాడు. ఇదే సమయంలో పక్కనే నివాసం ఉంటున్న త్రినాథస్వామి అతని భార్య హైదరాబాద్‌లో ఉంటున్న తమ కుమారుడి వద్దకు వెళ్లారు. ఆ ఇంటికి తాళాలు వేసి ఉండటం గమనించిన పవన్‌కుమార్‌ ఒక రోజు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి 13 కాసుల బంగారు ఆభరణాలు, ఓ ట్యాబ్‌ ఎత్తుకెళ్లిపోయాడు. గత నెల 23న తణుకు వచ్చిన త్రినా«థస్వామి కుటుంబం తమ ఇంట్లో చోరీ జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై జి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
ట్యాబ్‌ ఆధారంగా.. : నిందితుడు దొంగిలించిన ట్యాబ్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పవన్‌కుమార్‌ కదలికలపై దృష్టి సారించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం చేసినట్లు అంగీకరించాడు. ఒక పక్క డిగ్రీ చదువుతున్న పవన్‌కుమార్‌ జల్సాలకు అలవాటు పడి దొంగతనానికి పాల్పడ్డాడని సీఐ రాంబాబు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.1.80 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. నిందితుడిని మంగళవారం కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌ వి«ధించారు. ఈ కేసులో సహకరించిన పట్టణ ఎస్సై జి.శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు శ్రీధర్, సంగీత్, శ్రీనివాసు, గణేష్, వాసు, సంగయ్యలను సీఐ అభినందించారు. 
 
మరిన్ని వార్తలు