జనసేన సభలో అపశ్రుతులు

9 Sep, 2016 22:51 IST|Sakshi
జనసేన సభలో అపశ్రుతులు
  • చెట్టు కొమ్మలు విరిగి, గోడపై నుంచి పడి..
  • ఒకరు మృతి, నలుగురుకి గాయాలు
  •  
    బోట్‌క్లబ్‌ (కాకినాడ)/కుయ్యేరు (కాజులూరు) :
    సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిర్వహించిన  సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. జేఎన్‌టీయూకే గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో.. చెట్టు కొమ్మలు విరిగిపడడంతో పాటు ఎత్తయిన గోడపై నుంచి కొందరు కిందపడిన సంఘటనల్లో ఒకరు మరణించగా, నలుగురికి గాయాలయ్యాయి. ప్రధాన వేదికకు దూరంగా గోడపై పవన్‌ అభిమానులు కూర్చొన్నారు. ఈ క్రమంలో కొందరు గోడపై నుంచి కిందపడ్డారు. కాజులూరు మండలం కుయ్యేరుకు చెందిన నందికోళ్ల వెంకటరమణ(22) తలకు తీవ్ర గాయమైంది. అతడిని హుటాహుటిన అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అలాగే గ్రౌండ్‌లో ఉన్న పెద్ద చెట్టు ఎక్కి పవన్‌ అభిమానులు సభను తిలకిస్తున్నారు. ఎక్కువ మంది ఎక్కడంతో, ఆ బరువుకు చెట్టు కొమ్మలు విరిగిపోయాయి. దీంతో కొందరు యువకులు కిందపడి, గాయాలపాలయ్యారు. ఆయా సంఘటనల్లో రాయవరం మండలం లొల్ల గ్రామానికి చెందిన రవ్వా రవి, పెద్దాపురం మండలం గోరింట గ్రామానికి చెందిన కర్రి రాజారావు, రామచంద్రపురం మండలం వెల్ల సావరానికి చెందిన కురసాల సుబ్రహ్మణ్యం, పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పుప్పాల ప్రసాద్‌ గాయాలపాలై, కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా స్వల్పంగా గాయపడిన కొందరు ఆస్పత్రికి రాకుండా, అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు చెబుతున్నారు.
     
    విద్యుదాఘాతంతోనా?
    ఇలాఉండగా వెంకటరమణ గోడపై నుంచి పడడం వల్ల గాయపడి చనిపోలేదని, సంఘటన స్థలంలో ఉన్న సౌండ్‌బాక్సు వైర్ల కారణంగా విద్యుదాఘాతానికి గురైనట్టు సభకు హాజరైన కొందరు పేర్కొన్నారు. గోడపై నుంచి పడడం వల్లే తలకు గాయమైనట్టు పోలీసులు చెబుతున్నారు. మృతదేహానికి శనివారం పోస్ట్‌మార్టం చేయనున్నట్టు తెలిపారు. సర్పవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
     
    కుయ్యేరులో విషాదం
    అభిమాన నటుడు పవన్‌కల్యాణ్‌ను చూసి, ఆయన ప్రసంగాన్ని వినేందుకు వెళ్లిన వెంకటరమణ మరణించడంతో కుయ్యేరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అవివాహితుడైన వెంకటరమణ పెయింటర్‌గా పనిచేసేవాడు. ఇతడి తండ్రి తర్రయ్య(అబ్బులు) వ్యవసాయ కూలీ కాగా, తల్లి లక్ష్మి గృహిణి. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న తమ్ముడు, మూగ చెల్లెలు ఉన్నారు. పెద్ద కొడుకు కావడంతో తానే కుటుంబ బాధ్యతలు చూస్తున్నాడు. తమ్ముడు, చెల్లెలు బాగోగులు చూసుకుంటాడని ఆశించిన తల్లిదండ్రులకు అతడి మరణం తీరని శోకాన్ని మిగిల్చింది.
     
     
     
     
>
మరిన్ని వార్తలు