జనగామకు చీకటి రోజు

23 Aug, 2016 00:42 IST|Sakshi
  • మా గొంతు కోయకండి
  • ఆరు మండలాలతో రెవెన్యూ డివిజనా?
  • ఈ ప్రాంత ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలి
  • జేఏసీ చైర్మన్‌ ఆరుట్ల దశమంతరెడ్డి
  • నేటినుంచి ఆమరణ దీక్ష.. 
  • అన్ని పార్టీల మద్దతు 
  • జనగామ : నూతన జిల్లాల ముసాయిదా ప్రకటనతో జనగామలో చీకట్లు కమ్ముకున్నాయని జేఏసీ చైర్మన్‌ ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. పట్టణంలోని జూబ్లీ గార్డెన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు డాక్టర్‌ లక్ష్మీనారాయణ నాయక్, పోకల లింగయ్య, నాగారపు వెంకట్‌తో కలిసి మాట్లాడారు. జిల్లాల డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ప్రకటించి, సంబురాలు చేసుకోమంటున్న సీఎం కేసీఆర్, జనగామ ప్రజలు ఏం చేయాలో చెప్పాలని డిమాండ్‌ చేశారు.
     
    ప్రత్యేక తెలంగాణ సాధనలో ముఖ్యభూమిక పోషించినందుకే ఈ శిక్ష వేశారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని, శాస్త్రీయ పద్ధతిలో జిల్లాలను చేస్తామని ప్రకటించిన సీఎం, ఏకపక్షంగా డ్రాఫ్ట్‌ను ప్రకటించడం సిగ్గుచేటన్నారు. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లోనూ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో కలిపిన మండలాల జాబితాలో జనగామ పేరు గల్లంతు చేశారని విమర్శించారు. జనగామ కో సం పది మండలాల ప్రజలు ఉద్యమాలు చే స్తుంటే, వద్దంటున్న హన్మకొండ, నిర్మల్‌ జిల్లాలను చేయడమేంటని ప్రశ్నించారు. సిద్దిపేట, అర్భన్‌ రెండు మండలాలు చూపించిన ప్రభుత్వం, జనగామ మున్సిపాలిటీ, రూరల్‌ను ఒకే మండలంగా గుర్తించడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.
    గ్రామపంచాయతీ స్థాయికి దిగజార్చారు..
    పది మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా కొనసాగుతున్న జనగామకు ఆరు మండలాలను మాత్రమే కేటాయించి, గ్రామపంచాయతీ స్థాయికి దిగజార్చారని దశమంతరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 
    నేటి నుంచి ఆమరణ దీక్ష..
    నూతన జిల్లాల ముసాయిదాలో జనగామకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నేటి నుంచి ఆమరణ దీక్ష చేపడతానని దశమంతరెడ్డి ప్రకటించారు. అన్ని పార్టీలు పూర్తి మద్దతు ప్రకటించాయని తెలిపారు. జనగామ జిల్లా ప్రకటించేవరకూ దశల వారీగా ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు తీగల సిద్దూగౌడ్, ఆలేటి సిద్దిరాములు, సత్యం, కాసుల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు