నీళ్లు నమిలారు.. నోళ్లు నొక్కారు

10 Jan, 2017 22:40 IST|Sakshi
నీళ్లు నమిలారు.. నోళ్లు నొక్కారు
చాలాచోట్ల ముగిసిన జన్మభూమి గ్రామసభలు
ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) :
జిల్లాలో ఈ నెల 2న ప్రారంభమైన జన్మభూమి గ్రామసభలు చాలాచోట్ల మంగళవారంతో ముగిశాయి. ఇటు ప్రజాప్రతినిధులు.. అటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సభలు ప్రారంభమైన నాటినుంచి ప్రజలు ప్రతిచోట అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీయడంతో సమాధానం చెప్పలేక కొన్ని ప్రాంతాల్లో వారి నోళ్లు మూయించేందుకు ప్రయత్నించగా.. మరికొన్ని చోట్ల ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు రెండుమూడు సభలకు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన సభలను స్థానిక ప్రజాప్రతినిధులతో కానిచ్చేశారు. ఉన్నతాధికారులు సైతం జన్మభూమి సభల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. తప్పనిసరి పరిస్థితుల్లో సభలకు హాజరైనవవారు మాత్రం ప్రజలకు సమాధానం చెప్పలేక గుండెలు బిగబట్టుకుని దిక్కులు చూశారు.
 
పింఛన్లు.. ఇళ్ల స్థలాల కోసం నిలదీత
జన్మభూమి సభలకు ప్రతిచోట జనం పలుచగా హాజరయ్యారు. పింఛన్లు రద్దయిన వారు కన్నీటి పర్యంతం కాగా.. గత గ్రామసభల్లో పింఛన్లు, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ సభలకు వచ్చి.. తాము పెట్టుకున్న అర్జీలు ఏమయ్యాయంటూ ప్రజాప్రతినిధులు, అధికారులను దులిపేశారు.
 
 
మరిన్ని వార్తలు