ఆంధ్రప్రదేశ్ అధికార పీఠం మేడిన్ జపాన్

26 Mar, 2016 01:41 IST|Sakshi

- రాజధాని భవనాలకు మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా ఫుమిహికో మకి అసోసియేట్స్
- జ్యూరీ నిర్ణయాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు
- ఐకానిక్ నిర్మాణాలుగా అసెంబ్లీ, హైకోర్టు
- వీటి పూర్తిస్థాయి డిజైన్ల బాధ్యత మాస్టర్ ఆర్కిటెక్ట్‌కు
- ఇందుకోసం 2017 ఏప్రిల్ వరకు గడువు

- మిగతా డిజైన్లు రూపొందించే సంస్థలకు ‘మకి’ సహకారం
- జపాన్ సంస్థకు రూ.97.5 లక్షలు చెల్లించనున్న సీఆర్‌డీఏ


సాక్షి, విజయవాడ బ్యూరో:
రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మాణానికి జపాన్ డిజైన్ ఎంపికైంది. ఇందుకోసం నిర్వహించిన పోటీలో టోక్యోకు చెందిన ఫుమిహికో మకి అసోసియేట్స్‌ను మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా సీఆర్‌డీఏ నియమించిన జ్యూరీ ఎంపిక చేసింది. శుక్రవారం నగరంలోని ఒక హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయం ప్రకటించారు. అంతకుముందు.. తుది పోటీలో నిలిచిన మూడు సంస్థలు రూపొందించిన డిజైన్లను సీఎం పరిశీలించారు. ఆ సంస్థలు ఇచ్చిన ప్రజెంటేషన్లను వీక్షించారు. ఆ తర్వాత జ్యూరీ చైర్మన్ క్రిస్టోఫర్ బెనిగర్ తాము ఎంపిక చేసిన డిజైన్ కవర్‌ను ముఖ్యమంత్రికి అందించగా ఆయన ప్రకటన చేశారు.

మకి అసోసియేట్స్ ఐకానిక్ కట్టడాలుగా గుర్తించిన అసెంబ్లీ (లెజిస్లేచర్), హైకోర్టు భవనాలకు తుది డిజైన్లు రూపొందిస్తుంది. మిగతా భవనాల డిజైన్లకు సంబంధించి మార్గదర్శకాలు అందజేస్తుంది. ఇందుకోసం మకి సంస్థకు సీఆర్‌డీఏ రూ.97.5 లక్షలు చెల్లించనుంది. అసెంబ్లీ, హైకోర్టు భవనాల పూర్తిస్థాయి డిజైన్లను 2017 ఏప్రిల్ నాటికల్లా సీఆర్‌డీఏకు మకి అసోసియేట్స్ సమర్పించాల్సి ఉంది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే వీటి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. 2017 మే నెల కల్లా నిర్మాణాన్ని ప్రారంభించి 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన సచివాలయం, రాజ్‌భవన్, సీఎం నివాసం, స్టేట్ గెస్ట్ హౌస్, విభాగాధిపతుల కార్యాలయాలు, నివాస సముదాయాలు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు తయారు చేయడానికి సీఆర్‌డీఏ ఎనిమిది ఆర్కిటెక్ట్ సంస్థలు, మూడు ల్యాండ్ స్కేప్, మూడు ఇంటీరియర్ డిజైన్ సంస్థలను ఎంపిక చేయనుంది. 2016 డిసెంబర్‌కల్లా డిజైన్లు ఖరారుచేసి అదే నెలలో టెండర్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. 2017 జనవరి కల్లా వీటి నిర్మాణాన్ని ప్రారంభించి 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు.


తుది రేసులో భారతీయ సంస్థ
సింగపూర్ కంపెనీలు పరిపాలనా రాజధాని (సీడ్ క్యాపిటల్), రాజధాని నగరం, రాజధాని రీజియన్‌లకు విడివిడిగా మాస్టర్‌ప్లాన్‌లు సమర్పించాయి. ప్రభుత్వం తొలి దశలో 900 ఎకరాల్లో పరిపాలన రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించి అందుకోసం డిజైన్ల పోటీ నిర్వహించింది. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, రాజ్‌భవన్, సీఎం నివాసం, విభాగాధిపతుల కార్యాలయాలు, ఇతర ముఖ్య భవనాల నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు ఇచ్చేందుకు దేశ, విదేశాలకు చెందిన పలువురు ఆర్కిటెక్ట్‌లు పోటీపడ్డారు. కానీ బ్రిటన్‌కు చెందిన రిచర్డ్ రోజర్స్ (రోజర్స్ స్ట్రిక్ హార్బర్ అండ్ పార్టనర్స్), భారత్‌కు చెందిన బీవీ దోషి నేతృత్వంలోని వాస్తు శిల్ప కన్సల్టెంట్స్, మకి సంస్థలు మాత్రమే తుది రేసులో నిలిచాయి.

 

రిచర్డ్ రోజర్స్ స్థానిక పరిస్థితులకనుగుణంగా అత్యాధునిక డిజైన్ తయారు చేయగా, వాస్తు శిల్ప కన్సల్టెంట్స్ భారతీయత ఉట్టిపడేలా డిజైన్‌ను ఇచ్చింది. మకి అసోసియేట్స్ స్థానిక చరిత్ర, వారసత్వం, ఆధునిక నిర్మాణ రీతులను ప్రతిబింబించేలా  డిజైన్‌ను రూపొందించింది. మూడు డిజైన్లను ఈ నెల 23వ తేదీ నుంచి ప్రఖ్యాత భారతీయ ఆర్కిటెక్ట్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ బెనిగర్ నేతృత్వంలోని జ్యూరీ సభ్యులు విశ్లేషించి ఆధునిక నిర్మాణ రీతులు, పర్యావరణం, సోలార్ వ్యవస్థలతో సరికొత్తగా డిజైన్‌ను రూపొందించిన మకి అసోసియేట్స్‌ను విజేతగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

 అసలు పని మొదలైంది : చంద్రబాబు
మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపికతో రాజధానిలో అసలు పని మొదలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఏ పోటీలోనైనా విజేతను ఎంపిక చేయడానికి గంట సమయం తీసుకుంటారని, కానీ మాస్టర్ డిజైన్ ఎంపికకు చాలారోజులు సమయం కేటాయించి సహకరించారంటూ.. జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తుది పోటీలో నిలిచిన మూడు సంస్థల డిజైన్లు బాగున్నాయని చెప్పారు. విజేతగా నిలిచిన సంస్థతో పాటు మిగిలిన సంస్థలు రూపొందించిన డిజైన్లలో కీలకమైన వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఎంపిక చేసిన డిజైన్‌పై ప్రజల అభిప్రాయం తీసుకుంటామని, ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లోనూ దీనిపై చర్చ పెడతామన్నారు. అమరావతిలో నిర్మించే ఐకానిక్ బ్రిడ్జిని కూచిపూడి వారసత్వానికి చిహ్నంగా నిలిచేలా డిజైన్ చేయిస్తున్నామని, చైనా ఈ పనిచేస్తోందని తెలిపారు. జ్యూరీ సభ్యులు మాట్లాడుతూ.. ప్రకృతి, సంస్కృతి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మకి సంస్థ డిజైన్‌ను ఎంపిక చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు నారాయణ, పుల్లారావు, దేవినేని ఉమ, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్, జ్యూరీ సభ్యులు కేటీ రవీంద్రన్, ఇర్విన్ విరే, కేశవ్ వర్మ, సుహా ఓజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

నేడు, రేపు ప్రదర్శన
తుది పోటీలో నిలిచిన మూడు సంస్థలు రూపొందించిన డిజైన్లను ఈ నెల 26, 27 తేదీల్లో నగరంలోని డీవీ మనార్ హోటల్‌లో ప్రజల కోసం ప్రదర్శించనున్నారు. ఈ మూడు సంస్థలకు రూ.3 లక్షల చొప్పున ఇవ్వనున్నారు.

>
మరిన్ని వార్తలు