27న ‘గోరటి’కి జాషువా కవితా పురస్కారం

13 Sep, 2016 20:06 IST|Sakshi
27న ‘గోరటి’కి జాషువా కవితా పురస్కారం
గుంటూరు ఈస్ట్‌: మహాకవి కవికోకిల నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 121వ జయంతోత్సవాలు సందర్భంగా గోరటి వెంకన్నకు జాషువా కవితా పురస్కారం అందజేస్తున్నట్లు ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జిల్లా రిజిస్ట్రార్‌ ఎస్‌.బాలస్వామి తెలిపారు. అరండల్‌ పేటలోని ఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జాషువా పురస్కార కవితాసభ నిర్వహిస్తున్నామని చెప్పారు. సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘువులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణ రావు మాట్లాడుతూ జాషువా సాహిత్య విశిష్టతపై ప్రముఖకవి యండ్లూరి సుధాకర్, గోరటి వెంకన్న కవిత్వంపై మువ్వా శ్రీనివాస్‌ ప్రసంగిస్తారని వెల్లడించారు. ఆహ్వాన సంఘ గౌరవాధ్యక్షుడు ఏసీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.ముత్యం,  జాషువా విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎన్‌.కాళిదాసు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పీవీ రమణ, నాయకులు బి.లక్ష్మణరావు, సి.హెచ్‌.కిన్నర్, తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు