వీడని మిస్టరీ

20 Jul, 2016 12:35 IST|Sakshi
వీడని మిస్టరీ

జాస్మిన్, శ్రీసాయి మృతిపై విచారణ ముమ్మరం
నిందితుడు పవన్ చెబుతున్న ఆంశాలపై పోలీసుల దృష్టి
జాస్మిన్ సోదరుడు, బంధులను గోప్యంగా విచారణ చేస్తున్న పోలీసులు

 
రేపల్లె : నిజాంపట్నం మండలం అడవులదీవి గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న షేక్ జాస్మిన్, వేముల శ్రీసాయి మృతి మిస్టరీ వీడలేదు. జాస్మిన్ మృతి ఘటనలో నిందితులుగా ఉన్న వేముల శ్రీసాయి, జొన్న పవన్‌కుమార్‌లను చెట్టుకు కట్టేసి కొట్టారు. దీంతో శ్రీసాయి మృతిచెందాడు. జాస్మిన్ బంధువులు తీవ్రంగా కొట్టటం వల్లే శ్రీసాయి మృతి చెందాడని పోలీసులు నిర్ధారించారు. శ్రీసాయి మృతి కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మందిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. శ్రీసాయి మృతి కేసులో విచారణ ఒక కొలిక్కి వచ్చినట్లేననే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే జాస్మిన్ మృతి మిస్టరీ మాత్రం మీడలేదు. ఉరి వేసుకుని జాస్మిన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు జొన్న పవన్‌కుమార్ చెబుతున్నాడు. ఆదివారం జాస్మిన్ తన పుట్టినరోజని, ఇంట్లో ఎవరు లేరని, రావాలని శ్రీసాయికి ఆమె స్నేహితురాలితో ఫోన్ చేయించిందని పవన్‌కుమార్ తెలిపాడు. జాస్మిన్, శ్రీసాయి కొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం వాస్తవమని, దీంతో శ్రీసాయి, తాను జాస్మిన్ ఇంటికి వెళ్లామని చెప్పినట్లు తెలిసింది.

ఇంట్లో ఉండగా...
జాస్మిన్ ఇంటి నుంచి తాను, ఆమె స్నేహితురాలు బయటకు వెళ్లిపోయామని పవన్‌కుమార్ చెబుతున్నాడు. ఇంట్లో శ్రీసాయి, జాస్మిన్ ఉన్న సమయంలో ఆమె బంధువు గౌస్ తలుపు కొట్టగా.. శ్రీసాయిని వెనుక డోర్ నుంచి పంపించిందని వివరించాడు. కొద్దిసేపటికి శ్రీసాయికి జాస్మిన్ ఫోన్ చేసి ‘నీవు ఇంటికి వచ్చిన విషయం గౌస్ చూసి మా అన్నకు పోన్ చేసి చెప్పాడు. మా అన్న నాకు ఫోన్ చేసి తిట్టి చావమన్నాడు. ఇక నాకు బతకాలని లేదు. చనిపోతున్నాను..’ అని చెప్పిందని తెలిపాడు. వెంటనే శ్రీసాయి, తాను వెళ్లి జాస్మిన్ స్నేహితురాలిని కలిసి విషయం చెప్పి వెళ్లి ఏమి చేస్తుందో చూసి రావాలని పంపామని చెప్పాడు. అమె ఇంట్లోకి చూసే సరికి జాస్మిన్ ఫ్యాన్‌కు ఉరి పెట్టుకుని ఉన్నట్లు వచ్చి చెప్పిందని, వెంటనే వెళ్లి పక్కనే ఉన్న ఇద్దరు వృద్ధులకు విషయం చెప్పి, ఇంట్లోకి వెళ్లి జాస్మిన్  ఉరి పోసుకున్న చీరను శ్రీసాయి ఒక్కడే తొలగించి, 108కు ఫోన్ చేశాడని పవన్ పోలీసులకు వివరించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన గౌస్ తమను ఇంట్లోకి నెట్టి ఇంటి తలుపులకు గడియపెట్టినట్లు చెప్పాడు. పవన్‌కుమార్ బెబుతున్న విషయాలపై పోలీసులు దృష్టి పెట్టి లోతుగా విచారణ చేస్తున్నరు.

పోస్టుమార్టం రిపోర్టుపై పలురకాల చర్చలు
జాస్మిన్ పోస్టుమార్టం రిపోర్టుపై పలురకాలుగా చర్చ సాగుతోంది. పోస్టుమార్టం ప్రథమిక రిపోర్టు వైద్యాధికారుల నుంచి అందలేదని, రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. జాస్మిన్, శ్రీసాయి మృతిపై కేసులు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నామని డీఎస్పీ పి.మహేష్ తెలిపారు.

శ్రీసాయికి కన్నీటి విడ్కోలు
మహ్మదీయపాలెం గ్రామస్తుల ఆగ్రహానికి బలైన వేముల శ్రీసాయి(18)కి కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. అడవులదీవి గ్రామంలో శ్రీసాయి అంత్యక్రియలు నిర్వహించారు. జాస్మిన్, వేముల శ్రీసాయి మృతితో రెండు రోజులుగా అడవులదీవిలో సెక్షన్-144 అమల్లో ఉంది. అడవులదీవిలో బంద్ నిర్వహించారు.
 

మరిన్ని వార్తలు