ఎయిరిండియా సిబ్బందిపై జేసీ ఫైర్

15 Sep, 2016 20:05 IST|Sakshi

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎయిరిండియా సిబ్బందిపై అనంతపురం ఎంపీ జె.సి.దివాకర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. ఎంపీ జె.సి.దివాకర్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లేందుకు ఎయిరిండియా రీజినల్‌కు చెందిన మధ్యాహ్నం 1.20 గంటల సర్వీస్‌కు టికెట్ బుక్ చేసుకున్నారు. విజయవాడ నుంచి అనుచరులతో కలిసి రోడ్డు మార్గం ద్వారా అర్ధగంట ముందుగానే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. బోర్డింగ్ పాస్ కోసం వెళ్లగా అప్పటికే విమానం నిండిపోయిందని, సీట్లు ఖాళీ లేవని ఎయిరిండియా సిబ్బంది సమాధానమిచ్చారు.

టికెట్ కన్ఫర్మేషన్ అయినట్లుగా ఫోన్‌కు మెసేజ్ పంపి ఇప్పడు సీటు లేదని చెప్పడం ఏంటని వాదనకు దిగారు. దీంతో విమానంలో 72 సీటింగ్ మాత్రమే ఉన్నాయని.. 84 మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారని... సిబ్బంది తెలిపారు. దీంతో అదనంగా ఉన్న 12 టికెట్లకు బోర్డింగ్ ఇవ్వ లేదని వివరించారు. టికెట్లు నిరాకరించిన వారిలో ఎంపీతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ కూడా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పి వీఐపీ లాంజ్‌లో కూర్చునేందుకు కూడా నిరాకరించారు. ఎయిరిండియా తీరుపై స్వయంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజుకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి ఆదేశాల మేరకు అక్కడికి చేరుకున్న ఎయిర్‌పోర్టు డెరైక్టర్ మధుసూదనరావు ఎయిరిండియా ప్రతినిధులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. చివరికి విమానంలోని ఫ్లయిట్ ఇంజినీరు సీటును ఎంపీకి కేటాయించడంతో ఆయన హైదరాబాద్ వెళ్లగలిగారు.

మరిన్ని వార్తలు