బాలల హక్కులు హరిస్తే కఠిన చర్యలు

3 Aug, 2017 19:14 IST|Sakshi

అనంతపురం అర్బన్‌: బాలల హక్కుల పరిరక్షణకు నిర్ధేశించిన చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని జేసీ-2 సయ్యద్‌ ఖాజా మొహిద్ధీన్‌ హెచ్చరించారు. బాల్యవివాహాల రహిత జిల్లాగా అనంతను  తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. మానవత్వంతో అనాథ పిల్లలకు సేవలందించాలనన్నారు. బాలల హక్కుల పరిరక్షణపై కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఐసీడీఏస్‌ పీడీ కృష్ణకుమారితో కలిసి జిల్లా ౖచెల్డ్‌ ప్రొటెక‌్షన్‌ యూనిట్‌ సభ్యులతో గురువారం ఆయన సమీక్షించారు.  పిల్లల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, ఆడపిల్లలపై వివక్ష, లింగ నిర్ధారణ, భ్రూణహత్యలు, అనాథ పిల్లల సంరక్షణ తదితర అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు.

క్షేత్ర స్థాయిలో బాల్యవివాహాలను ప్రోత్సహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనాథ పిల్లల కోసం సదనాలు నడుపుతున్న స్వచ్ఛంద సంస్థలు తప్పని సరిగా ఈ నెల 10వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ చేయించకోవాలని లేకుంటే బాలల న్యాయ చట్టం మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని వివాహాలు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌ నిర్బంధ వివాహాల నమోదు చట్టం 2002 క్రింద నమోదు అయ్యేలా ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. బస్టాండు, రైల్వే స్టేషన్, భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణాధికారి సుబ్రహ్మణ్యం, సంరక్షణాధికారి వెంకటేశ్వరి, కౌన్సిలర్‌ చంద్రకళ, సోషల్‌ వర్కర్లు నాగలక్ష్మి, మురళీధర్, శ్రీలక్ష్మీ, భార్గవి, రామాంజినమ్మ, షామీర్, రాజేష్‌ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు