జ్ఞాపకాల పూదోటలో..

17 Jul, 2016 22:37 IST|Sakshi
జ్ఞాపకాల పూదోటలో..

జ్ఞాపకాల పూదోటలో..
చిన్ననాటి మధుర స్మృతులను నెమరేసుకుంటూ 30 ఏళ్ల తరువాత స్నేహితులు ఒక్కటయ్యారు. తమ ఉన్నతికి బాటలు వేసిన గురుదేవులను ఘనంగా సన్మానించారు. ఆత్మీయ స్వాగతంతో గురువుల సేవలను గుర్తు చేసుకున్నారు. జ్ఞాపకాల పూదోటలో విహరించారు. ఆదివారం ఇందుకు స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాల వేదికైంది. 1977 నుంచి 1988 వరకు ప్రాథమిక పాఠశాల, హైస్కూలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థినీ, విద్యార్థులు కలిశారు. ప్రాథమిక పాఠశాలకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు ఐదుగురు, హైస్కూలులో పనిచేసిన 25 మంది విశ్రాంత ఉపాధ్యాయులు, 15మంది విశ్రాంత అధ్యాపకులను సత్కరించారు. సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ, పాకాల హైస్కూలు, జూనియర్‌ కళాశాలలో చదివిన వారు దేశ, విదేశాల్లో మంచి స్థానాల్లో స్థిరపడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సిమెంటు రేకుల షెడ్డు స్థితి నుంచి పక్కా భవనాల స్థాయికి హైస్కూలు అభివృద్ధి చెందడం వెనుక పూర్వ విద్యార్థుల కృషి కూడా ఎంతో ఉందని తెలిపారు.  ఇదో మరపురాని అ‘పూర్వ’ ఘట్టమన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు గురువుల ఆశీస్సులు పొందారు. పాఠశాల ప్రాంగణంలో 250 మొక్కలను నాటారు. తాము హైస్కూలు అభివృద్ధికి మున్ముందు కూడా సహకారం అందిస్తామని తెలిపారు. తాము ఎక్కడెక్కడ స్థిరపడ్డామో తెలియజేస్తూ, ఆనాటి జ్ఞాపకాలు పంచుకున్నారు. సహపంక్తి భోజనాలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో పూర్వ విద్యార్థులు కిర్రెత్తించారు.  కార్యక్రమంలో విశ్రాంత ఎంఈఓ మునస్వామి, విశ్రాంత టీచర్లు, విశ్రాంత అధ్యాపకులు, విశ్రాంత పీడీలు వెంకటరమణారెడ్డి, డీ.కృష్ణమనాయుడు, శ్రీరామరెడ్డి, రాఘవాచారి, దామోదర్‌రెడ్డి, జ్యోతీశ్వర్‌రెడ్డి, కె.రఘునాథరెడ్డి, సుబ్రమణ్యం, నరసింహారెడ్డి, విజయ్‌కుమారి, విక్టోరియా, విమలమ్మ, సుగుణ, శారద, హనుమంతనాయుడు, శివకుమార్‌ తదితరులను సన్మానించారు. అలాగే, ఒకప్పటి తమ ట్యూషన్‌ మాస్టారు, ప్రస్తుతం గోవాలో స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్‌ను కూడా సత్కరించారు. ప్రభుత్వ పాఠశాల హెఎం.చంద్రశేఖర్‌నాయుడు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కొండలరాయుడు, పాకాల, మదనపల్లె, తిరుపతి, అమెరికా, బెంగళూరు, ఒంగోలు, హైదరాబాద్, తిరుపతి, తమిళనాడు తదితర ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు