ఉస్మానియాలో చేరతా..

15 Sep, 2016 21:48 IST|Sakshi
ఉస్మానియాలో చేరతా..
విజయవాడ (లబ్బీపేట) : మెడిసిన్‌ చేయాలనే ఆకాంక్ష నెరవేరడంతో పాటు ఏపీ తెలంగాణాల్లోని అత్యుత్తమ వైద్య కళాశాల ఉస్మానియాలో చేరనున్నట్లు తెలంగాణ ఎంసెట్‌ (మెడిసిన్‌) టాప్‌ ర్యాంకర్‌ రేగళ్ల ప్రపుల్ల మానస పేర్కొంది. ఫస్ట్‌ ర్యాంకు సొంతం చేసుకున్న మానసను తల్లిదండ్రులు రేగళ్ల కేశవరెడ్డి, సుధారాణి ఆనందంతో  మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా మానస విలేకరులతో మాట్లాడుతూ తాను పదో తరగతి విశ్వభారతి స్కూల్‌లో చదవగా, ఇంటర్మీడియెట్‌ శ్రీచైతన్య నారాయణ కళాశాలలో పూర్తిచేశానని, ఏపీ ఎంసెట్‌లో 4వేలు ర్యాంకు వచ్చిందని, తెలంగాణ ఎంసెట్‌–2లో 126 ర్యాంకు సాధించినట్లు తెలిపింది. ప్రస్తుతం విడుదలైన ఎంసెట్‌–3 ఫలితాల్లో టాప్‌ ర్యాంకును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంది. తనకు కళాశాలలోని అధ్యాపకుల శిక్షణతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని, ఏపీ ఎంసెట్‌లో 4వేలు ర్యాంకు వచ్చినా నిరుత్సాహ పడకుండా పట్టుదలతో చదవడం వల్లే టాప్‌ ర్యాంకులు సొంతం చేసుకుని, ఉన్నతస్థాయి కళాశాలలో సీటు సాధించగలిగినట్లు పేర్కొంది. ప్రపుల్ల మానస తండ్రి, గుడ్లవల్లేరు మండలం ఎంపీడీవో రేగళ్ల కేశవరెడ్డి మాట్లాడుతూ మానస కచ్చితంగా ర్యాంకు సాధిస్తుందనే నమ్మకంతో చదివించామన్నారు. మెడిసిన్‌ చేయాలనే పట్టుదలను చూసి ప్రోత్సహించామని, టాప్‌ర్యాంకు సాధించినట్లు తెలిపారు. తల్లి సుధారాణి మాట్లాడుతూ మానస ఫస్ట్‌ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 
రూ.లక్ష చెక్కు అందజేసిన భవిష్య అకాడమీ
కానూరు (పెనమలూరు) : ప్రపుల్ల మానసకు కానూరులోని భవిష్య అకాడమీ నిర్వాహకులు గురువారం రూ.లక్ష చెక్కు అందజేశారు. ఈ అకాడమీలో మానస షాట్‌టర్మ్‌ ఎంసెట్‌ కోచింగ్‌ తీసుకుంది. ఈ సందర్భంగా గురువారం అకాడమీలో జరిగిన విలేకరుల సమావేశంలో మానస మాట్లాడుతూ అకాడమీ అధ్యాపకుల ప్రోత్సాహంతో తాను పట్టుదలతో చదివానని, తాను తెలంగాణ ఎంసెట్‌లో 152 మార్కులు సాధించి ఫస్టు ర్యాంకు సాధించానని పేర్కొంది. కార్డియాలజిస్టు కావాలనేది తన కోరిక అని తెలిపింది. ఈ సమావేశంలో భవిష్య అకాడమీ అధ్యాపకులు జి.వెంకటరావు, సాయిబాబు, డి.రామ్మూర్తి పాల్గొన్నారు.
 
 
 
 
మరిన్ని వార్తలు