కనికరం లేని ప్రభుత్వం

27 May, 2017 00:07 IST|Sakshi
కనికరం లేని ప్రభుత్వం

- రైతుల ఇబ్బందులను ఏమాత్రమూ పట్టించుకోవడంలేదు
- కళ్లు తెరిపించేందుకే ‘మేలుకొలుపు’ పాదయాత్ర
- వైఎస్సార్‌సీపీ శింగనమల సమన్వయకర్త  జొన్నలగడ్డ పద్మావతి
- యల్లనూరు నుంచి పాదయాత్ర ప్రారంభం


అనంతపురం : ‘పది మందికీ అన్నం పెట్టే అన్నదాతలు వరుస కరువులతో పంటలు పండక అప్పుల పాలయ్యారు. కుటుంబం కూడా గడవని పరిస్థితుల్లో వలసలు వెళుతున్నారు. అక్కడా పనుల్లేక  భిక్షమెత్తుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. రైతుల కోసం ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమోనని మూడేళ్ల పాటు ఎదురుచూశా. ఏమాత్రమూ పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకునే పాదయాత్రకు శ్రీకారం చుట్టాన’ని శింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి తెలిపారు. వేసవిలో పాదయాత్ర చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని చాలామంది చెప్పారని, అయితే.. రైతులు పడుతున్న కష్టాల కంటే తాను పడే ఇబ్బందులు పెద్దవి కావని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ జొన్నలగడ్డ పద్మావతి శింగనమల నియోజకవర్గంలో సుమారు 150 కిలోమీటర్ల మేర  పాదయాత్ర చేస్తున్నారు.

ఈ పాదయాత్ర శుక్రవారం యల్లనూరులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పద్మావతి మాట్లాడారు.  నియోజకవర్గ రైతాంగ సమస్యలపై కలెక్టరేట్‌ ముట్టడి, జాతీయ రహదారి దిగ్బంధం, హెచ్చెల్సీ ఎస్‌ఈ కార్యాలయం ముందు ఆందోళనలు చేశామని గుర్తు చేశారు. అయినా అ«ధికారులు స్పందించలేదన్నారు. ఎమ్మెల్యే యామినిబాల, ఎమ్మెల్సీ శమంతకమణి ప్రతి పనిలోనూ పర్సెంటేజీలు తీసుకోవడంలో మునిగిపోయారు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కొందరికి స్థలం కొంటే కలిసొస్తుంది, మరికొందరికి పెళ్లయితే కలిసొస్తుంది, ఇంకొందరికి పిల్లలు పుడితే కలిసొస్తుంది... అయితే చంద్రబాబుకు ఇతరులను వెన్నుపోటు పొడవడం కలిసొస్తోందని ఎద్దేవా చేశారు. బిడ్డనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి ఓసారి సీఎం అయ్యారు.. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, చేనేతలను వెన్నుపోటు పొడిచి 2014లో మరోసారి సీఎం పీఠమెక్కారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు మరోసారి అవకాశం ఇస్తారా అంటూ ప్రజలను ప్రశ్నించారు. టీడీపీకి తగిన గుణపాఠం నేర్పాలని కోరారు. అలాగే తన పాదయాత్రకు అన్నివర్గాల ప్రజలు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు.

రైతు సమస్యలపై అడిగేవారేరీ? : అనంత
రైతు సమస్యలపై జిల్లాలో ఏ ఒక్క టీడీపీ ప్రజాప్రతినిధీ అడగడం లేదని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నిస్తే ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా మీకు సిగ్గుంటే, జిల్లాపై ప్రేమ ఉంటే సీఎం చంద్రబాబును నిలదీయాలని సూచించారు. ఈ ఏడాది జిల్లాకు 28 టీఎంసీల దాకా నీళ్లొచ్చినా కనీసం 26 ఎకరాలకు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి దౌర్జన్యంగా నీళ్లు తరలించుకుపోతే ప్రశ్నించే సాహసం చేయని దద్దమ్మలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక గేదెకాని, అవు కాని ఇచ్చారా? రైతులు, కూలీలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు.

సీఎం అబద్ధాలతో మోసం చేస్తున్నారు : శంకరనారాయణ
చంద్రబాబు 2014 ఎన్నికల్లో దాదాపు 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని, సీఎం పీఠమెక్కాక ఒక్క హామీ   పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ ధ్వజమెత్తారు. పైగా రోజుకో అబద్ధం చెబుతూ ప్రజలను మోసగిస్తున్నారన్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చలువ వల్లే జిల్లాకు హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు వస్తున్నాయని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి, మాజీ మంత్రి నర్సేగౌడ్, పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యులు ఎర్రిస్వామిరెడ్డి, రైతు విభాగం రాయలసీమ అధ్యక్షులు శరత్‌చంద్రారెడ్డి, పార్టీ మడకశిర సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నదీం అహమ్మద్, నాయకులు మీసాల రంగన్న, మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, యల్లనూరు ఎంపీపీ ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు రమణ, సర్పంచ్‌ ఓబులేసు,  ఎస్సీ సెల్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు పెన్నోబులేసు, బోయ సుశీలమ్మ  మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి, ఎంపీసీటీ సభ్యురాలు సునీత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు