పయనం ... ప్రయాస

6 Jan, 2017 23:31 IST|Sakshi
 • పండగ ప్రయాణం తడిసిమోపెడే..
 • చార్జీల మోత మోగించనున్న ప్రైవేటు ట్రావెల్స్‌ 
 • అదే దారిలో ఆర్టీసీ కూడా..
 • రైళ్లలోనూ భారీగా వెయిటింగ్‌ లిస్ట్‌
 • హైదరాబాద్‌ నుంచి జిల్లాకు వచ్చే ఆర్టీసీ బస్సులలో సైతం టిక్కెట్లు దాదాపు నిండుకున్నాయి. ప్రత్యేక బస్సులు వేసి చార్జీలను 50 శాతం పెంచే అవకాశమున్నందున ప్రయాణికులపై భారం ఎక్కువగానే పడనుంది. పండగ సందర్భంగా ఆర్టీసీ నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయబోమని మంత్రి శిద్దా చెప్పారు. కానీ, ఇందుకు సంబంధించి కొత్తగా ఎటువంటి ఉత్తర్వులూ విడుదల కాలేదు. మరోపక్క ప్రత్యేక బస్సులంటూ నగరాల్లో తిరిగే మెట్రో సర్వీసులను, తెలుగు వెలుగు బస్సులను సహితం వినియోగించే అవకాశమున్నందున పండగ ప్రయాణం ప్రయాణికులకు పరీక్షగానే మారనుంది.
   
  అమలాపురం :
  ఇంటిల్లిపాదీ కలిసి.. ఏడాదికొక్కసారి ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండగ సంక్రాంతి. ఉపాధికి ఎక్కడెక్కడికో వెళ్లినవారంతా.. మూడు రోజులపాటు జరిగే ఈ పండగ కోసం.. రెక్కలు కట్టుకుని మరీ సొంతూళ్లలో వాలిపోవాలని కోరుకుంటారు. ఈ సెంటిమెంటును ప్రైవేటు రవాణా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఆర్టీసీ కూడా అదే బాటలో పయనిస్తోంది. రైల్వేలో ఇప్పటికే చాంతాడంత వెయిటింగ్‌ లిస్టు ఉండడం, ఆశించిన స్థాయిలో ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం లేకపోవడం వీరికి పండగగా మారింది. పండక్కి వచ్చే వారిలో 70 శాతం మంది హైదరాబాద్‌ నుంచే ఉంటారు. తరువాత విశాఖ,  విజయవాడ, అమలాపురం, తిరుపతి, చెన్నై, బెంగళూరు తదితర నగరాల నుంచి వచ్చేవారు కూడా ఉంటారు. ఇదే అదునుగా పలువురు బస్సు ఆపరేటర్లు దోపిడీకి తెర తీశారు. పండగ సమయంలో రద్దీగా ఉండే రోజులకు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాలను గత నెల 15 నుంచే నిలిపివేశారు. తద్వారా ఆయా రోజులకు సంబంధించి టిక్కెట్లకు కృత్రిమ కొరత సృష్టించి, తద్వారా చార్జీలు పెంచి, ప్రయాణికులను బాదేసేందుకు సిద్ధమవుతున్నారు. పండగల ముందు 11, 12 తేదీల్లో జిల్లాలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలకు  ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తారు. పండగల మూడో రోజైన 15న ఆదివారం కావడంతో చాలా మంది తిరిగి వెళ్లే అవకావముంది. 16, 17 తేదీల్లో తిరిగి వెళ్లేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆయా రోజుల్లో టిక్కెట్ల అమ్మకాలను పలువురు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు దాదాపు నిలిపివేశారు. కొంతమంది ఇస్తున్నా రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి అమలాపురానికి మామూలు రోజుల్లో రూ.800 నుంచి రూ.900 వరకూ ఉండే టిక్కెట్‌ను రూ.1500 నుంచి రూ.1,800కు విక్రయిస్తున్నారు. అంబాజీపేటకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రూ.1,600 చేసి టిక్కెట్‌ కొనుగోలు చేసింది. తిరిగి వెళ్లేటప్పుడు అదే ధరకు టిక్కెట్‌ ఇవ్వాలన్నా.. అప్పటి పరిస్థితినిబట్టి చూస్తామని సదరు ట్రావెల్స్‌ సంస్థ చెప్పడంతో ఆమె అవాక్కయ్యింది. ఇప్పుడే చార్జీలు ఇలా ఉంటే 11, 12 తేదీల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.  పండగ పేరుతో ప్రైవేటు ట్రావెల్స్‌ అదనపు వసూళ్లు చేస్తే ఊరుకోబోమని రవాణా మంత్రి శిద్దా రాఘవరావు ప్రకటించినా అది ఆచరణకు దూరంగానే ఉంది. ఇక రైల్వేలో కూడా ప్రీమియం తత్కాల్‌ పేరుతో పండగ సమయంలో భారీగానే గుంజనున్నారు. రిజర్వేష¯ŒS రద్దు చేసుకున్నప్పుడు తిరిగి చెల్లించే సొమ్ములో భారీగా కోత పడుతున్నందున రైల్వే రిజర్వేష¯ŒS అంటేనే పలువురు బెంబేలెత్తుతున్నారు. గత ఏడాది పండగ సమయంలో హైదరాబాద్‌ నుంచి మధురపూడికి విమానం టిక్కెట్‌ రూ.11 వేల నుంచి రూ.16 వేల వరకూ పలికింది. సాధారణ సమయంలో ఇదే చార్జీ రూ.2,500కు మించదు. ఇలా  ప్రయాణాలు భారంగా మారడంతో సొంత కార్లున్నవారు వాటిలోనే సొంతూళ్లకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
   
మరిన్ని వార్తలు