కనుల పండువగా మధ్యారాధన

17 Mar, 2017 22:49 IST|Sakshi
కనుల పండువగా మధ్యారాధన
-నవ నిర్మాణ శిల్పికి భక్త నీరాజనం 
– వైభవంగా నవరత్న రథోత్సవం
– బంగారుపూత బృందావన గోపుర ప్రారంభోత్సవం 
మంత్రాలయం : నవ మంత్రాలయ శిల్పి, శ్రీమఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రతీర్థులకు భక్తజనం నీరాజనం పలికింది. సుయతీంద్రతీర్థుల చతుర్థి మహా సమారాధన మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం మధ్యారాధన నిర్వహించారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల నేతృత్వంలో వేకువజామున రాయరు సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సుయతీంద్రతీర్థుల బృందావనానికి నిర్మల్య విసర్జన, జల, పుష్ప, విశేష పంచామృతాభిషేకం గావించారు.  తర్వాత స్వామీజీ చిత్రపటాన్ని నవరత్న రథంపై ఉంచి పీఠాధిపతి హారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. మంగళవాయిద్యాల సుస్వరాలు, హరిదాస సాహిత్యం, మహిళల సంకీర్తనలతో శ్రీమఠం మాడవీధుల్లో అశేష భక్తజనం మధ్య రథయాత్ర కనుల పండువగా సాగింది. యజ్ఞమంటపంలో బెంగళూరుకు చెందిన సంగీత కులకర్ణి దాసవాణి భక్తులను ఎంతగానో అలరించింది. డోలోత్సవ మండపంలో విద్వాన్లు గురుప్రసాదాచార్య, రామవిఠలాచార్య ప్రవచనాలు ఆకట్టుకున్నాయి. పీఠాధిపతి పూజామందిర్‌లో మూల,జయ, దిగ్విజయ రాముల పూజలో తరించారు.  
 
బంగారు బృందావన గోపురం ప్రారంభోత్సవం :
శ్రీమఠం ముఖద్వార శిఖరాన బృందావనాన్ని బంగారు పూత తొడిగారు. హైదరాబాద్‌కు చెందిన దాత సహకారంతో బంగారు పూత పూశారు. వేడుక సందర్భంగా శుక్రవారం బృందావన గోపురాన్ని ప్రారంభించారు. వేడుకలో పండిత కేసరి గిరియాచార్, మఠం ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి,  మేనేజర్‌ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, జోనల్‌ మేనేజర్‌ శ్రీపతి ఆచార్, ద్వారపాలక అనంతస్వామి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్‌ పాల్గొన్నారు. 
 
నేడు ఉత్తరారాధన :
ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉత్తరారాధన నిర్వహించనున్నారు. సుప్రభాత సేవ, పాదపూజ, తీర్థ ప్రసాద వితరణ, మహా మంగళహారతులు ఉంటాయి. బెంగళూరుకు చెందిన వేదవ్యాసాచార్, బండిశ్యామాచార్, హుబ్లి దేఖాదినేష్‌ ప్రవచనాలు వినిపిస్తారు. 
 
>
మరిన్ని వార్తలు