ఏపీలో జంబ్లింగ్ విధానంలోనే పరీక్షలు

30 Jan, 2016 19:42 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలోనే జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియేట్ విద్యా మండలి కార్యదర్శి ఎం.వీ. సత్యనారాయణ శనివారం ఓ ప్రకటన జారీ చేశారు. ఫిబ్రవరి 4 నుంచి 24వ తేది వరకు జంబ్లింగ్ విధానంలో ఈ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. 723 పరీక్షా కేంద్రాలను ఇంటర్మీడియేట్ బోర్డు ఏర్పాటు చేసింది. ఇందులో 378 ప్రభుత్వ కళాశాలలు కాగా 345 ప్రైవేటు, ఆన్ ఎయిడెడ్ కాలేజీలు. ఈ పరీక్షలకు 2,99,476 మంది విద్యార్ధులు హాజరు కానున్నారు. విద్యార్ధులకు సంబంధించిన జవాబు పత్రాలు, ప్రశ్నాపత్రాలు, టైమ్ టేబుల్, ఓఎంఆర్ తదితర సామాగ్రిని ప్రాంతీయ కార్యాలయాలకు పంపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఇంటర్మీడియేట్ బోర్డు చర్యలు చేపట్టింది.

- విద్యార్ధులు తమ హాల్ టికెట్లు సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్ నుంచి పొందాలి.
- విద్యార్ధుల సౌకర్యార్ధం ప్రాక్టికల్ పరీక్షల కోసం ఆదివారం, సెలవు దినాల్లో కూడా ప్రయోగాలు చేపట్టడానికి కళాశాలలు తెరిచి ఉంచవలసిందిగా బోర్డు ఆదేశించింది.
- పరీక్షలు నిర్వహించే ఎగ్జామినర్లను కంప్యూటర్, ర్యాడ్‌నైజేషన్ ద్వారా ఎంపిక చేసి నియమించారు.
- ప్రతీ జిల్లాలకు బోర్డు నుంచి ఒక పరిశీలకుడ్ని పర్యవేక్షణాధికారిగా నియమించారు. దీంతో పాటు స్వ్కాడ్ సభ్యులు కూడా నియమితులయ్యారు.
- జిల్లా పరీక్ష కమిటీ. హైపవర్ కమిటీలు శనివారం నుంచే తమ విధులను ప్రారంభించాయి.
- ఈ పరీక్షలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులకు ఇంటర్మీడియేట్ బోర్డు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు