జంబ్లింగ్‌ జగడం

20 Sep, 2016 01:22 IST|Sakshi
ఏలూరు సిటీ : విద్యారంగంలో సర్కారు తీసుకొస్తున్న సంస్కరణలతో గందరగోళ పరిస్థితులు నెల కొంటున్నాయి. చట్టాలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే వాటికి భిన్నంగా నూతన విధానాలు అమలు చేసేందు కు ప్రయత్నించటాన్ని ఉపాధ్యాయ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈనెల 21 నుంచి పాఠశాల విద్యార్థులకు నిర్వహించే సమ్మెటివ్‌–1 పరీక్షకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనను జంబ్లింగ్‌ విధానంలో చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ కామన్‌ పరీక్షా విధానం అమలు చేయటాన్ని స్వాగతిస్తున్న ఉపాధ్యాయులు మూల్యాంకనలో జంబ్లింగ్‌ విధానాన్ని అమలు చేయాలనే నిర్ణయాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక మండలంలోని విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను వేరే మండలానికి పంపించి మూల్యాంకన చేయించడం వల్ల అనే సమస్యలు ఉత్పన్నమవుతాయని వాదిస్తున్నారు. 
విద్యాబోధనకు విఘాతమే
సమ్మెటివ్‌–1 పరీక్షలకు సంబంధించి విద్యార్థులందరికీ ఏకీకృత (కామన్‌) ప్రశ్నాపత్రాలను ఇస్తారు. దీని ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులంతా ఒకే రకమైన పరీక్ష రాయాల్సి ఉంటుంది. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో అయితే ప్రశ్నాపత్రాలను పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు పోలీస్‌ బందోబస్తు నడుమ విద్యా శాఖ అధికారులు విడుదల చేస్తారు. సమ్మెటివ్‌ కామన్‌ పరీక్షకు అటువంటి అవకాశం లేదు. దీనివల్ల పారదర్శకత లోపిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఒక మండలానికి సంబంధించిన జవాబు పత్రాలు ఇతర మండలాల్లోని స్కూల్‌ కాంప్లెక్స్‌ల్లో మూల్యాంకన చేస్తారు. దీనివల్ల వాటిని దిద్దేందుకు వెళ్లే ఉపాధ్యాయులు 15నుంచి 20రోజులపాటు తరగతులకు దూరమవుతారు. ఫలితంగా విద్యాబోధన కుంటుపడుతుందని, దీనివల్ల విద్యార్థులు నష్టపోతారని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఏడాదిలో మూడు సమ్మెటివ్‌ పరీక్షలు జరుగుతాయి. ఆ జవాబు పత్రాల మూల్యాంకన కోసం ఉపాధ్యాయులు మొత్తంగా 45 రోజులకుపైగా పాఠశాలలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. విద్యాహక్కు చట్టం–09 ప్రకారం విద్యార్థి వయసు ఆధారంగా పాస్, ఫెయిల్‌తో సంబంధం లేకుండా పై తరగతులకు పంపించాల్సి ఉంది. ఇక నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానంలోనూ ఉపాధ్యాయుడే విద్యార్థికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. విద్యాహక్కు చట్టం ఇలా చెబుతుంటే.. విద్యాశాఖ అధికారులు కొత్త విధానాలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. 
ఇదో ప్రహసనమే
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో 6నుంచి 10వ తరగతి విద్యార్థులు సుమారు 2.50 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ సమ్మెటివ్‌–1 పరీక్షలో జవాబు పత్రాల మూల్యాంకన జంబ్లింగ్‌ విధానంలో చేపడతారు. ఐదు పరీక్షలకు సంబంధించి లక్షల సంఖ్యలో జవాబు పత్రాలను మూల్యాంకన చేయటం ప్రహసనంగా మారనుంది. ఇలా ఏడాదిలో మూడు పరీక్షలకు జవాబు పత్రాల మూల్యాంకన చేయటం సామాన్యమైన విషయం కాదంటున్నారు. నాణ్యమైన విద్య అంటూనే విద్యారంగాన్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
కామన్‌ పరీక్ష మంచిదే కానీ..
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు కామన్‌ పరీక్షలు నిర్వహించటం మంచిదే. కానీ.. జవాబు పత్రాల మూల్యాంకనను జంబ్లింగ్‌ పద్ధతిలో చేయాలనే ఆలోచన సరికాదు. దీనివల్ల ఉపాధ్యాయులు పాఠశాలలకు దూరమవుతారు. విద్యార్థులకు సరైన బోధన అందదు. అధికారులు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవటం మానుకోవాలి
– బీఏ సాల్మన్‌రాజు, ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్‌ జిల్లా శాఖ
 
సంస్కరణలు ఇలాకాదు
విద్యారంగంలో ఒకేసారి సంస్కరణలు చేస్తే ఆశించిన స్థాయిలో ఫలితాలు రావు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యారంగ నిపుణులు, ప్రైవేట్‌ విద్యాసంస్థలతో చర్చించి విద్యార్థికి ప్రయోజనం కలిగేలా విధానాలు రూపొందించాలి. విద్యాహక్కు చట్టం, సీసీఈ విధానాలకు భిన్నంగా నూతన విధానాలు ఉంటున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనలో జంబ్లింగ్‌ విధానం సమర్థనీయం కాదు. 
–  ఎంబీఎస్‌ శర్మ, ఉపాధ్యక్షుడు, అపుస్మా
 
మరిన్ని వార్తలు