జంబ్లింగ్‌కు తాత్కాలికంగా వెనకడుగు

3 Oct, 2016 22:16 IST|Sakshi
  • తొలిసారిగా ఉమ్మడి పరీక్షా విధానం  
  • పాఠశాల స్థాయిలోనే మూల్యాంకనం
  • రాయవరం :
    పాఠశాల స్థాయిలో తొలిసారిగా ఉమ్మడి పరీక్షా విధానానికి విద్యాశాఖ తెరతీసింది. సమగ్ర నిరంతర మూల్యాంకనం(సీసీఈ) విధానంలో నిర్వహిస్తున్న ఉమ్మడి పరీక్షా విధానంలో జంబ్లింగ్‌ తరహాలో మూల్యాంకనం చేయాలని కూడా తలపోసింది. అయితే టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు జంబ్లింగ్‌ విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. 
     
    జిల్లా వ్యాప్తంగా సమ్మేటివ్‌–1 పరీక్షలు
    విద్యాశాఖ తొలుతగా ప్రాథమిక, ఉన్నత స్థాయి పరీక్షల్లో ఉమ్మడి పరీక్షా విధానం అమలు చేయాలని భావించింది. ప్రైవేటు పాఠశాలలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆరో తరగతి నుంచి అమలు చేసేందుకు నిర్ణయించారు. పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని జంబ్లింగ్‌ విధానంలో నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు భావించారు. ఈ విధానం అమలులో చోటు చేసుకునే ఇబ్బందులు, నష్టాలు ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో పరీక్షలకు రెండు రోజుల ముందు జంబ్లింగ్‌ విధానంలో పరీక్షా పేపర్ల మూల్యాంకనంపై సవరణ చేశారు. ఆరు, ఏడు తరగతులకు సమ్మేటివ్‌–1, 2, 3 పేపర్ల మూల్యాంకనాన్ని మండల స్థాయిలో కాకుండా పాఠశాల స్థాయిలోనే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. 8, 9 తరగతులకు సమ్మేటివ్‌–1, 2 పరీక్ష పేపర్ల మూల్యాంకనాన్ని జంబ్లింగ్‌ విధానంలో కాకుండా పాఠశాల స్థాయిలోనే నిర్వహించాలని, సమ్మేటివ్‌–3 పరీక్షలను మాత్రమే జంబ్లింగ్‌ తరహాలో మూల్యాంకనం చేయాలని నిర్ణయించారు. ఆరు నుంచి టెన్త్‌ వరకు సమ్మేటివ్‌–1, 2, 3 పేపర్లను అన్ని సబ్జెక్టుల్లోనూ ఐదు శాతం జవాబు పత్రాలను ప్రత్యేక బృందం ద్వారా మూల్యాంకనం జరుగుతుంది. ప్రస్తుత సమ్మేటివ్‌ పరీక్షల్లో టెన్త్‌ పరీక్షల్లో మాదిరిగా అన్ని పాఠశాలలకూ పర్యవేక్షకులను నియమించారు.
     
    బృందాల నియామకం ..
    జిల్లాలో ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పరిధిలోని  4.03,860 మంది విద్యార్థులు సమ్మేటివ్‌–1 పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు జరుగుతున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 2,098 మంది పరిశీలకులను నియమించారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తుండగా, పరీక్షలను పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో మోడరేటివ్‌ బృందాలను నియమించారు. ఎంఈవో చైర్మన్‌గా స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం, ఒక సీనియర్‌ హెచ్‌ఎం, ఇద్దరు స్కూల్‌ అసిస్టెంట్లు ఈ కమిటీలో ఉంటారు. వేర్వేరు సబ్జెక్టులు బోధించే వారిని టీమ్‌లో నియమించారు. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల మాదిరిగానే జిల్లా వ్యాప్తంగా ఈ బృందాలు సమ్మేటివ్‌–1 పరీక్షలు జరుగుతున్న కేంద్రాలను సందర్శించాయి. అలాగే డివిజన్‌ స్థాయిలో ప్రతి డివిజన్‌కు ఒక కమిటీని నియమించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు టీమ్‌లు(స్కా్వడ్స్‌) సమ్మేటివ్‌–1 పరీక్షలను తనిఖీలు నిర్వహించారు.
     
>
మరిన్ని వార్తలు