దమ్ముంటే.. రాజీనామా చేయండి

22 Mar, 2017 14:26 IST|Sakshi
దమ్ముంటే.. రాజీనామా చేయండి

ప్రొద్దుటూరు: దమ్ము, ధైర్యం ఉంటే జమ్మలమడుగు, బద్వేలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సవాల్‌ విసిరారు. ఈ రెండు స్థానాల్లో అధికార పార్టీ నేతలు గెలిస్తే 2019 ఎన్నికల్లో జిల్లాలో తాము పోటీ చేయబోమని పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలను గెలుస్తామని టీడీపీ నేతలు ప్రకటించారన్నారు. అలాగే పులివెందుల నియోజకవర్గంలో గెలుస్తామని సతీష్‌రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్ని మార్లు పోటీ పెట్టి ఓడిపోయారో ప్రజలకు తెలియంది కాదని పేర్కొన్నారు. ఓడిపోయిన వరద, లింగారెడ్డిలకు మాట్లాడే అర్హత లేదన్నారు.

సంస్కార హీనంగా మాట్లాడటం తగదు: వివేకానందరెడ్డి తమ పార్టీలోకి వస్తే పదవి ఇస్తామని టీడీపీ నేతలు సంస్కార హీనంగా మాట్లాడటం తగదని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కోడ్‌ ఇచ్చి, వారిని భయభ్రాంతులకు గురి చేసి, బెదిరించి విజయం సాధించారన్నారు. సినీ గ్లామర్‌ ఉన్న ఎన్టీ రామారావు లాంటి నాయకుడే చిత్తరంజన్‌దాసు చేతిలో ఓటమి పాలయ్యారని, అలాగే గుడివాడలో కటారి ఈశ్వర్‌ కుమార్‌ చేతిలో ఓడిపోయారన్నారు. ఉక్కు మహిళ అయిన ఇందిరాగాంధీకి కూడా ఓటమి తప్పలేదన్నారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎన్నికల్లో అధికార పార్టీ ఘోర వైఫల్యాన్ని చవిచూస్తోందన్నారు. విద్యావంతులు తగిన బుద్ధి చెప్పారన్నారు.

ఎర్రచందనం స్మగ్లర్‌ డబ్బు పెట్టాడు: రాయచోటి ప్రాంతంలో ఒక ఎర్రచందనం స్మగ్లర్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో రూ.8 కోట్లు ఖర్చు పెట్టాడని ఆరోపించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా విజయలక్ష్మి, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ మురళీధర్‌రెడ్డి, కౌన్సిలర్లు చిలేకాంపల్లి యామిని, శివకుమార్‌ యాదవ్, టప్పా గైబుసాహెబ్‌తోపాటు చిన్నరాజు, రాజుపాళెం మండల కన్వీనర్‌ నారాయణరెడ్డి, వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు