జూరాల క్రస్టుగేట్ల మూసివేత

16 Aug, 2016 00:43 IST|Sakshi
-కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
జూరాల : కష్ణానది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోపై ప్రభావం పడింది. సోమవారం సాయంత్రం జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు కేవలం 52వేల క్యూసెక్కులు వస్తుండటంతో క్రస్టుగేట్లన్నింటినీ మూసివేశారు. జలవిద్యుత్‌ కేంద్రంలోని ఆరు టర్బైన్లలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ 44వేల క్యూసెక్కులను పవర్‌హౌస్‌ ద్వారా దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.65టీఎంసీలు కాగా 9.29టీఎంసీలను నిల్వ ఉంచారు. జూరాల రిజర్వాయర్‌ ద్వారా కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల ఎత్తిపోతల పథకాలకు నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో కేవలం 84,688 క్యూసెక్కులు వస్తుండటంతో అన్ని క్రస్టుగేట్లను మూసివేశారు. విద్యుదుత్పత్తి ద్వారా 45వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72టీఎంసీలు కాగా 117టీఎంసీలను నిల్వ ఉంచారు. నారాయణపూర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64టీఎంసీలు. ప్రస్తుతం 32టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. పై నుంచి రిజర్వాయర్‌కు 59,371 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద వస్తుండగా నాలుగు క్రస్టుగేట్లు తెరవడంతోపాటు విద్యుదుత్పత్తి ద్వారా జూరాల రిజర్వాయర్‌కు 22,072 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు.
 
మరిన్ని వార్తలు