ఇప్పుడే గుర్తొచ్చిందా?!

4 Jul, 2017 23:46 IST|Sakshi
ఇప్పుడే గుర్తొచ్చిందా?!
- ఉప ఎన్నిక నేపథ్యంలో నంద్యాలపై సర్కారుకు వల్లమాలిన ప్రేమ
- గ్రామీణ రోడ్లకు రూ.63 కోట్లు విడుదల
- మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశం
- బనగానపల్లె  పనుల్లో జాప్యం
 
కర్నూలు(అర్బన్‌): త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నంద్యాల నియోజకవర్గంపై రాష్ట్ర ప్రభుత్వానికి వల్లమాలిన ప్రేమ పుట్టుకొచ్చింది. పట్టణ ఓటర్ల నుంచి సానుభూతి పొందేందుకు ఓ వైపు మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయల పనులు చేపడుతూనే.. మరో వైపు పల్లె ప్రజల ఓట్లకు గాలం వేసేందుకు నంద్యాల రూరల్, గోస్పాడు మండలంలో కూడా పనులను షురూ చేసింది. నంద్యాల నుంచి  వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గెలిచిన భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతరం గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మూడేళ్ల నుంచి నంద్యాల అభివృద్ధిపై శీతకన్ను వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం  ఉప పోరులో ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
 
ఈ నేపథ్యంలోనే జిల్లాకు చెందిన మంత్రి భూమా అఖిలప్రియతో పాటు మంత్రులు కాలవ శ్రీనివాసులు, నారాయణ వారంలో రెండు రోజులు అక్కడే తిష్టవేసి పార్టీ వ్యవహారాలతో పాటు పలు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి  అధ్యక్షతన ఈ నెల 3న జరిగిన సమావేశంలో నంద్యాల రూరల్, గోస్పాడు మండలంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లకు రూ.63 కోట్లు విడుదల చేస్తూ.. మూడు నెలల్లో ఈ పనులు పూర్తి కావాలని సంబంధిత ఇంజినీర్లకు దిశానిర్దేశం చేశారు.  నంద్యాల రూరల్‌ మండలం, గోస్పాడు మండలంలో వేర్వేరు దశల్లో ఉన్న 45 అంగన్‌వాడీ కేంద్రాలు, 19 గ్రామ పంచాయతీ భవనాలతో పాటు 45 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లను పూర్తి చేసేందుకు రూ. 19 కోట్లను విడుదల చేశారు. అలాగే ఈ రెండు మండలాల్లో దాదాపు 100 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు వేసేందుకు రూ.44 కోట్లను విడుదల చేశారు. ఎంతో కాలంగా ఈ పనులకు నిధులు విడుదల చేయాలని కోరుతున్నా పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నిధులు విడుదల చేసిందని స్థానికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. 
 
బనగానపల్లె పనుల్లో జాప్యం ...
నంద్యాలకు నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం ఇతర నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇటీవలే బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని రోడ్లకు సంబంధించి 15 పనులకు రూ.8.43 కోట్లు అవసరమవుతాయని ముఖ్యమంత్రి కార్యాలయంలో నివేదికలు అందించినట్లు సమాచారం. ఆ నివేదికలు జిల్లా పంచాయతీరాజ్‌ కార్యాలయానికి రాగా,  సంబంధిత ఇంజినీర్లు అంచనాలు రూపొందించి తిరిగి ప్రభుత్వానికి పంపారు. ఇంకా  వాటికి ఆమోదం లభించనట్లు తెలుస్తోంది. అలాగే పలు నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన  రోడ్ల పనులకు కూడా ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదని సమాచారం.
 
>
మరిన్ని వార్తలు