కధనరంగం

13 Dec, 2016 23:47 IST|Sakshi
కధనరంగం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : నగదు కోసం ప్రజలు పడుతున్న కష్టాలు.. వారి ఆందోళనలు కదనరంగాన్ని తలపిస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు అనంతర పరిణామాలు చివరకు ప్రాణాలను సైతం హరిస్తున్నాయి. గత నెల 8న పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ చిల్లర నోట్లను, అవసరమైన స్థాయిలో నగదును సమకూర్చకపోవడం, ఉన్న కొద్దిపాటి నగదును సర్దుబాటు చేసేందుకు బ్యాంకులు విధిస్తున్న ఆంక్షల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనెల 1న బుట్టాయగూడెం మండలం అచ్చియ్యపాలెంకు చెందిన కాకర్లమూడి రాములమ్మ అనే వృద్ధురాలు పింఛను సొమ్ము కోసం కన్నాపురం ఆంధ్రాబ్యాంక్‌కు వెళ్లి.. ఇంటికి చేరిన అనంతరం ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. బ్యాంక్‌ ఎదుట గంటల తరబడి వేచివున్నా ఆమెకు పింఛను సొమ్ము అందలేదు. క్యూలో నిలబడటం వల్ల అనారోగ్యానికి గురైన ఆమె ఇంటికి వచ్చిన తరువాత మరణించింది. ఈనెల 9న నిడదవోలు ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన బైనే ఏసేబు (75) పింఛను డబ్బు కోసం మూడు రోజులపాటు బ్యాంకు చుట్టూ తిరిగి.. చివరకు ప్రాణాలు వదిలాడు. తాజాగా మంగళవారం జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామానికి చెందిన బొర్రా వెంకట్రావు (65) పింఛను కోసం అదే గ్రామంలోని ఎస్‌బీఐ కియోస్క్‌ బ్రాంచ్‌ వద్ద క్యూలో నిలబడగా.. గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఆయనను ఆసుపత్రికి తరలించగా మరణించాడు. 
నగదు వచ్చినా..
జిల్లాకు రూ.121 కోట్ల విలువైన కరెన్సీ వచ్చింది. ఇందులో రూ.2 వేలు, రూ.500, రూ.100, రూ.50, రూ.20 నోట్లు ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో ఏటిఎంలలో నింపేం దుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె.భాస్కర్‌ చెప్పారు. అయితే, ఏ ఏటీఎంలోనూ రూ.100, రూ.500 నోట్లు రాలేదు. బ్యాంకుల్లోనూ చిల్లర నోట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మూడు రోజుల వరుస సెలవుల అనంతరం బ్యాంకులు తెరుచుకోవడంతో ఉదయం నుంచే ప్రజలు నగదు కోసం బారులు తీరారు. ప్రతి బ్యాంకు వద్ద చాంతాడంత క్యూలు కనిపిం చాయి. నగదు సక్రమంగా అందకపోవడం, అవసరమైనంత సొమ్ము ఇవ్వకపోవడంతో పలుచోట్ల ప్రజలు రోడ్డెక్కారు. దీంతో బ్యాంకుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం భీమవరం ఎస్‌బీఐ మెయి న్స్‌  బ్రాంచ్‌ వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఒక్కొక్కరికి రూ.2 వేలకు మించి నగదు ఇవ్వకపోవడంతో కనీసం రూ.4 వేలైనా ఇవ్వాలంటూ ఖాతాదారులు ఆందోళనకు దిగారు. పెద్దఎత్తున నినాదాలు చేయడంతో సీనియర్‌ సిటిజన్స్‌ ను బ్యాంకు అధికారులు లోపలికి పిలిపించి చర్చించారు. అనంతరం రూ.4 వేల చొప్పున ఇస్తామని అధికారులు ప్రకటించడంతో ఖాతాదారులు ఆందోళన విరమిం చారు. నరసాపురం ఎస్‌బీఐ మెయి న్‌ బ్రాంచ్‌లో డబ్బులు లేవని 12 గంటల వరకూ చెల్లింపులు చేపట్టలేదు. మిగిలిన బ్రాంచ్‌ల్లో రూ.2 వేల చొప్పున మాత్రమే బట్వాడా చేశారు. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం ఎస్‌బీఐలో ‘నో క్యాష్‌’ బోర్డు పెట్టారు. టి.నర్సాపురం ఆంధ్రాబ్యాంకులో ఖాతాదారులను 2 గంటలపాటు క్యూలైన్లో ఉంచి, నగదు లేదని చెప్పటంతో నిరాశతో వెనుదిరిగారు. చింతలపూడిలో మధ్యాహ్నానికే నగదు నిండుకోవడంతో క్యూలో ఉన్న వారికి టోకెన్లు ఇచ్చి పంపించారు. పోడూరు ఇండియ న్‌ బ్యాంక్‌ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. తాము అమ్ముకున్న ధాన్యానికి సంబంధించిన నగదులో రూ.24 వేలను ఒకేసారి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దాళ్వా పెట్టుబడులకు చేతిలో చిల్లి గవ్వలేక ఇబ్బం దులు పడుతున్నామని వాపోయారు. ఇరగవరంలో బ్యాంకు నుంచి నగదు తీసుకునేందుకు వచ్చి క్యూలో నిలబడిన ఓ వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోయింది. పెదవేగి మండలం విజయరాయి ఎస్‌బీఐ వద్ద వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోయింది. రంగాపురం ఆంధ్రాబ్యాంక్‌లో క్యాష్‌ అయిపోవటంతో ఇక్కడకు వచ్చిన వారంతా నిరాశ చెందారు. టి.నరసాపురం ఆంధ్రాబ్యాంకు వద్ద ఉదయం 9 గంటలకే వందలాక ఖాతాదారులు బ్యాంకు బారులు తీరారు. సిబ్బంది 11 గంటలకు వచ్చి నగదు లేదని, ఎటువంటి చెల్లింపులు జరగవని ప్రకటించడంతో రెండు గంటలపాటు వేచి ఉన్న వారంతా నిరుత్సాహంతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. మక్కినవారిగూడెం, బొర్రంపాలెం బ్యాంకుల్లో మధ్యాహ్నం వరకు పింఛ న్‌దారులకు మాత్రమే నగదు ఇచ్చి మధ్యాహ్నం తరువాత ఖాతాదారులకు రూ.4 వేల చొప్పున చెల్లింపులు జరిపారు. 
 
మరిన్ని వార్తలు