నాలుగు గోపురాల వాడా..నమో నారసింహ..

4 Mar, 2017 22:22 IST|Sakshi
నాలుగు గోపురాల వాడా..నమో నారసింహ..

–7న ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
–8న శ్రీవారి కల్యాణోత్సవం
–18న బ్రహ్మ రథోత్సవం            

       
ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి కదిరిలో నిత్య పూజలతో వెలుగొందుతున్నారు. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 నుంచి పక్షం (15) రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఇక్కడ నారసింహుని ఆలయం నాలుగు గోపురాల నడుమ వెలసింది. అందుకే ‘నాలుగు గోపురాల వాడా.. నమో నారసింహా’ అంటారు. తూర్పు రాజగోపురాన్ని విజయనగర రాజు హరిహరరాయలు నిర్మించారు. పడమర రాజగోపురాన్ని క్రీ.శ 1469లో నృసింహుని భక్తురాలు సాసవుల చిన్నమ్మ నిర్మించినట్లు తెలుస్తోంది. ఉత్తర రాజ గోపురాన్ని ముస్లిం పాలకులు నిర్మించారు. ప్రతియేటా ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే ఈ గోపురం తలుపులు తెరుచుకుంటాయి. దీన్ని వైకుంఠ ద్వారం అంటారు. దక్షిణ రాజుగోపురాన్ని క్రీ.శ.1386లో కొక్కంటి పాలేగాళ్లు వీర మల్లప్ప నాయుడు కుటుంబీకులు నిర్మించారు. ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ వివిధ అవతారాల్లో కదిరి తిరువీధుల్లో తమ భక్తులకు కనువిందు చేస్తారు.

స్వేద బిందువులు చూడొచ్చు..
ప్రతినెలా స్వాతి నక్షత్రం రోజు మాత్రమే ఇక్కడి మూలవిరాట్‌కు అభిషేకం చేస్తారు. అభిషేకానంతరం చిన్నపిల్లలకు స్నానం చేయించిన తర్వాత ఎలాగైతే స్వేదబిందువులు శరీరంనుండి వెలువడతాయో స్వామివారి మూలవిరాట్‌ నుంచి కూడా స్వేద బిందువులను అప్పుడు చూడచ్చు. దీన్ని భక్తులు మహిమాన్వితంగా భావిస్తారు. స్వాతి నక్షత్రం రోజు జరిగే అభిషేకం చూడాలనుకునే భక్తులు రూ.750 చెల్లిస్తే ఇద్దరిని అనుమతిస్తారు.

ఆలయ చరిత్ర
కదిరి - అనంతపురం రహదారిలోని 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతిరేపల్లి(నేటి పట్నం) రంగనాయకుడికి ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వప్నం(కల)లో కన్పించి పుట్టలో ఉన్న విగ్రహాన్ని వెలికితీసి తనకు ఆలయం నిర్మించాలని కోరినట్లు బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తోంది. దీంతో ఆయన ఆ విగ్రహాన్ని వెలికితీసి, ప్రతిష్టించి గర్భగుడిని కట్టించినట్లు స్థలపురాణం చెబుతోంది. ఆ తర్వాత క్రీ.శ 1274లో శ్రీవీర బుక్కరాయలు కాలంలో పూర్తి స్థాయిలో ఆలయం నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

భృగుతీర్థ స్నానం..పాప విమోచనం
ఖాద్రీ దివ్యక్షేత్రానికి పడమటి వైపున అర్జున నదీ (మద్దిలేరు) తీరం ఉంది. అక్కడ భృగు మహర్షి తపస్సు చేసి.. స్వామి వారిని స్మరణం చేసుకున్నారు. ఆ మహర్షి కోరిక మేరకు శ్రీ వారు స్వయంగా శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవ విగ్రహాలు అందించినట్లు బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అప్పుడు స్వామివారే స్వయంగా అందించిన ఉత్సవ విగ్రహాలే ఇప్పుడు జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో తిరువీధుల్లో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీదేవి,భూదేవి సమేత లక్ష్మీ నారసింహుడు. భృగు మహర్షి తపస్సు ఫలితంగా ఖాద్రీ క్షేత్రంలో శ్రీవారు స్వయంభువుగా వెలిశారు. భృగు తీర్థంలో స్నానం చేసి, స్వామి వారిని దర్శించుకుంటే పాప విమోచనం కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది.

దేశంలోనే 3వ అతి పెద్ద తేరు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీనారసింహుడు ఈ నెల 18న రథోత్సవం సందర్భంగా బ్రహ్మరథంపై దర్శనమిస్తారు. ఆ రోజు లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా విచ్చేస్తారు. తమిళనాడులోని అండాల్‌ అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్‌ రథం తర్వాత 3వ అతిపెద్దది ఈ ఖాద్రీ నృసింహుని రథం.

కదిరి కొండపై శ్రీవారి పాదముద్రికలు
స్వామి వారి పాదాలు తాకితే ఈ జన్మకు ఇక చాలని ఏ భక్తుడైనా కోరుకుంటాడు. ఖాద్రీ లక్ష్మీ నారసింహుని పాద పద్మములు తాకాలంటే కదిరి కొండకు వెళ్లాల్సిందే. హిరణ్య కశ్యపుడిని సంహరించేందుకు శ్రీ మహా విష్ణువు సగం మనిషి, సగం సింహం రూపంలో అంటే నరసింహావతారమెత్తారు. ఉగ్రరూపంతో స్తంభం నుంచి ఆవిర్భవించారు. హిరణ్య కశ్యపుడి సంహారం అనంతరం ఉగ్రరూపంలో ఉన్న నారసింహుని ఆ రూపాన్ని ఉపసంహరించుకోవాలని ప్రహ్లాదుడు, దేవ దేవతలు, శ్రీదేవి, భూదేవిలు కదిరి కొండపై నుంచి ప్రార్థించారట. నృసింహుని మెప్పించేందుకు అక్కడి నుంచి వారంతా స్తోత్రం చేయడంతో స్వామి వారు అక్కడ దర్శనమిస్తారు. దీంతో ఆ పర్వతానికి ‘స్తోత్రాద్రి’ అనే పేరు వచ్చింది. ఆ సమయంలో స్వామి వారు అక్కడ మోపిన పాదాల గుర్తులు ఇప్పటికీ చెరిగిపోలేదు.

కదిరి మల్లెలకు ప్రత్యేకత ఉంది
కదిరి ప్రాంతంలో పండించే కదిరి మల్లెలు మనసును మైమరిపించే సువాసనలు వెదజల్లుతాయని భక్తులతో పాటు ఇక్కడ మల్లెపూలు విక్రయించేవారు చెబుతారు. పక్షం రోజుల పాటు సాగే ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని కదిరి మల్లెలతోనే అలంకరిస్తారు.

కదిరి దవణం నారసింహుడికి ఎంతో ఇష్టం
కదిరి దవణం కూడా ఇక్కడి ప్రత్యేకతల్లో ఒక భాగం. కదిరి దవణంతో సెంట్లు, అత్తరు తయారు చేస్తారు. ముంబై, బెంగళూరు వంటి నగరాలకు కదిరి దవణం ఎగుమతి చేస్తుంటారు. కదిరి దవణం నారసింహుడికి ఎంతో ఇష్టమని, అందుకే బ్రహ్మరథోత్సవం నాడు దవణం కొనుక్కొని తేరుపైకి భక్తులు విసురుతుంటారు.

గుబాళించే కదిరి కుంకుమ
ఇక కదిరి కుంకుమ విషయానికొస్తే హిందూ సంప్రదాయంలో ముత్తయిదువులు కుంకుమ, గాజులు, పూలు, మంగళసూత్రాలు, కాలి మెట్టెలు పవిత్రంగా భావిస్తారు. వీటిని ప్రధానంగా ముత్తయిదువులు ధరిస్తారు. కదిరి కుంకుమ దైవ పూజల్లో, శుభకార్యాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముత్తయిదువులు నుదుటున కదిరి కుంకుమ పెట్టుకున్నట్లైతే ఆ పరిసర ప్రాంతాల్లో ఆ సువాసన అట్లే పసిగట్టవచ్చు. అందుకే బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు తమవెంట కదిరి మల్లెలు, కదిరి కుంకుమ, కదిరి దవణంను విధిగా తీసుకెళ్తుంటారు.

ఆలయంలో శ్రీవారి దర్శనం వేళలు
ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు. పూజల అనంతరం ఉదయం 6 నుంచి 7.30 వరకు సర్వదర్శనం ఉంటుంది. తర్వాత 7.30 నుంచి 9.30 గంటల వరకు శ్రీవారికి అభిషేకం నిర్వహిస్తారు. అభిషేకం కోసం వెళ్లిన భక్తుల దర్శనానంతరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మళ్లీ సర్వదర్శనం ఉంటుంది. తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు, తర్వాత నైవేద్యం అనంతరం రాత్రి 8.30 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది.

శాశ్విత పూజలు
భక్తులు రూ. లక్ష విరాళం చెల్లిస్తే వారిని ‘మహారాజ పోషకులు’గా గుర్తించి, వారు కోరిన రోజున ఏడాదికి ఒక్క రోజు చొప్పున 10 ఏళ్ల పాటు శ్రీవారికి అభిషేకం చేస్తారు. ఈ అభిషేకానికి వారి తరఫున ఆరుగురు భక్తులకు అనుమతిస్తారు. రూ. 50 వేలు చెల్లించిన వారిని ‘రాజపోషకులు’గా పిలుస్తారు. వీరి తరఫున నలుగురిని 10 ఏళ్లపాటు అభిషేకానికి అనుమతిస్తారు. రూ.25 వేలు చెల్లించిన భక్తులు ‘పోషకులు’గా పిలవబడతారు. వీరిలో ఏడాదికి ఒక్క రోజు చొప్పున ఇరువురిని అభిషేకానికి 10 ఏళ్లపాటు అనుమతిస్తారు. రూ.10 వేలు చెల్లిస్తే దాతలుగా గుర్తించి ఇద్దరికి ప్రత్యేక దర్శనం 5 ఏళ్లపాటు ఉంటుంది. ఇవి కాకుండా ప్రత్యేకంగా శ్రీవారికి కల్యాణం చేయించాలంటే రూ. 4 వేలు, ఉయ్యాలోత్సవానికి రూ.516 చెల్లిస్తే చాలు. ప్రతిరోజూ జరిగే అభిషేకానికి రూ.300 చెల్లిస్తే ఇద్దరు భక్తులను అనుమతిస్తారు.

భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు : ఆలయ సహాయ కమిషనర్‌ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి
బ్రహ్మోత్సవాల్లో రోజంతా నిత్యాన్నదానం ఉంటుంది. శ్రీవారి కల్యాణోత్సవంతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే బ్రహ్మరథోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసే భక్తులకు అద్దె గదులున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రాంగణమంతా సీసీ కెమెరాల నిఘా ఉంది. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేవరకూ ఆలయం ముందు పోలీస్‌ ఔట్‌పోస్ట్‌ కూడా ఉంటుంది.

సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యత – ఆలయ పాలక మండలి చైర్మన్‌ పచ్చిపులుసు నరేంద్రబాబు
బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకూడదన్నదే మా ఉద్దేశ్యం. ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఇంతటి గొప్పగా మరెక్కడా జరగవు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తారు. రథోత్సవం నాడు సుమారు 5 లక్షల మంది దాకా భక్తులు పాల్గొంటారు. నేను కూడా ఇక్కడ స్వామివారికి ఒక సేవకున్ని మాత్రమే.

పరిసర ప్రాంతాల్లో చూడదగ్గ ప్రదేశాలు
కదిరి లక్ష్మీ నారసింహుని దర్శించు కున్న పిమ్మట కదిరి–రాయచోటి రోడ్డు మార్గంలో కేవలం 12 కి.మీ దూరంలో గాండ్లపెంట మండలం కటారుపల్లిలో యోగి వేమన సమాధిని చూడవచ్చు. తర్వాత అదే మార్గంలో మరో 15 కి.మీ దూరంలో ఎన్‌పీ కుంట మండలం గూటిబైలు గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమానును సందర్శించవచ్చు. వీటిని చూసేందుకు కదిరి ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంది. పుట్టపర్తి కూడా ఇక్కడికి 40 కి.మీ మాత్రమే.

ఏరోజు ఏ ఉత్సవం?:
మార్చి 7న అంకురార్పణం
8వ తేదీ కళ్యాణోత్సవం
9వ తేదీ హంసవాహనం
10వ తేదీ సింహ వాహనం
11వ తేదీ హనుమద్‌ వాహనం
12వ తేదీ బ్రహ్మ గరుడోత్సవం
13వ తేదీ శేషవాహనం
14వ తేదీ సూర్య చంద్ర ప్రభ
15వ తేదీ మోహినీ ఉత్సవం
16వ తేదీ ప్రజా గరుడ సేవ
17వ తేదీ గజ వాహనం
18వ తేదీ బ్రహ్మ రథోత్సవం
19వ తేదీ అశ్వవాహనం
20వ తేదీ తీర్థవాది
21వ తేదీ పుష్పయాగోత్సవం
====

మరిన్ని వార్తలు