కడితే..కాష్టమే

15 Mar, 2017 00:52 IST|Sakshi
కడితే..కాష్టమే
భీమవరం :తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి మధ్య గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని కొనసాగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు హెచ్చరించారు. పచ్చని పొలాలు, జనావాసాల మధ్య నిర్మి స్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సముద్ర తీరానికి తరలించేంత వరకు రాజీలేని పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆక్వా పార్క్‌ ప్రభావిత గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటానికి కడవరకూ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీపీఎం, వైఎస్సార్‌ సీపీ, సీపీఐ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ ఎంఎల్‌ (న్యూ డెమోక్రసీ), ఫార్వార్డ్‌ బ్లాక్, జనసేన, పౌరహక్కుల సం ఘం, దళిత సంఘ నాయకులు, పర్యావరణ వేత్తలతో కూడిన బృందం మంగళవారం తుందుర్రు, కంసాలి బేతపూడి, ముత్యాలపల్లి గ్రామాల్లో పర్యటించింది. ఆ మూడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో అఖిలపక్ష నేతలు మాట్లాడారు. ప్రజాభీష్టానికి వ్యతి రేకంగా.. పోలీసులను ప్రయోగించి మహిళలపై నిరంకుశ దాడులు చేయిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగరువు గ్రామాల మహిళలు ఉద్యమించటం ద్వారా విజయం సాధించారన్నారు. వారి పోరాట పటిమ రాష్ట్ర వ్యాప్తంగా అందరి మన్ననలు పొందిందన్నారు. ఇదే స్ఫూర్తితో మరికొంతకాలం ఉద్యమిస్తే  ఆక్వా పార్క్‌ పునాదులు కదలడం ఖాయమన్నారు.
 
కడవరకు పోరాడదాం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు పొందటం ద్వారా ఇక్కడి మహిళలు ఆక్వా పార్క్‌ వ్యతిరేక ఉద్యమంలో తొలి విజయం సాధించారన్నారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదని.. ఫ్యాక్టరీని సముద్ర తీర ప్రాంతానికి తరలించే వరకూ కొనసాగుతుందన్నారు. ఆక్వా పార్క్‌ వ్యతిరేక ఉద్యమానికి కడవరకు అండగా ఉంటామని ప్రకటించారు. వేలాది ఎకరాల్లో పంటలను, ప్రజారోగ్యాన్ని తుడిచిపెట్టే ఆక్వా పార్క్‌ను ఇక్కడ నిర్మించవద్దని ప్రజలంతా కోరుతున్నా.. అందుకు విరుద్ధంగా ప్రభుత్వం, యాజమాన్యం వ్యవహరిస్తున్నాయన్నారు. ఆక్వా పార్క్‌ పునాదులు కదిలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, అప్పటివరకు ఉద్యమాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని సూచిం చారు. బుడబుక్కల టీడీపీ, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉద్యమానికి అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. తుందుర్రులో ఆక్వా పార్క్‌ నిర్మాణం కారణంగా జిల్లాలోని కాలుష్యకారకమైన అన్ని పరిశ్రమలకు ముప్పు వాటిల్లిందన్నారు. కాలుష్య నివారణకు త్వరలోనే భీమవరంలో నిరాహార దీక్షలు చేపడతామని ప్రకటించారు.
 
ఇది స్వచ్ఛమైన పోరాటం
ప్రముఖ పర్యావరణవేత్త ఎం.కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ఆక్వా పార్క్‌ వ్యతిరేక ఉద్యమం పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రజలు సాగిస్తున్న స్వచ్ఛమైన పోరాటమని అభివర్ణించారు. గతంలో పర్యావరణం కంటే డబ్బు సంపాదనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని.. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చిందనడానికి తుందుర్రు ఉద్యమమే ఉదాహరణ అన్నారు. విషం కక్కే ఫ్యాక్టరీలను జనావాసాల మధ్య పచ్చటి పొలాల్లో నిర్మించడం దారుణమన్నారు. ఆక్వా పార్క్‌ యాజమాన్యం కాలుష్య నియంత్రణకు ఎటువంటి హామీ పత్రాలు ఇవ్వకపోయినా ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వం అండగా నిలబడటాన్ని చూస్తే ప్రజాశ్రేయస్సుపై ప్రభుత్వానికున్న శ్రద్ధ ఏపాటిదో అవగతం అవుతోందన్నారు. 
 
ప్రభుత్వ దివాళాకోరుతనం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భీమవరం పట్టణ శాఖ కన్వీనర్‌ కోడే యుగంధర్‌ మాట్లాడుతూ ఆక్వా పార్క్‌ వద్దని ప్రజలు ఉద్యమం చేస్తుంటే.. ప్రజాధనాన్ని వెచ్చిస్తూ పోలీసులను ఫ్యాక్టరీకి కాపలా పెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబు దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. ఆక్వా పార్క్‌ వ్యతిరేక ఉద్యమానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎంసీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి మాట్లాడుతూ మూడేళ్లుగా ప్రజలు ఉద్యమిస్తుంటే అణచివేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నడం దుర్మార్గమన్నారు. అధికారులు సైతం ప్రజాభిప్రాయాన్ని మన్నించకుండా వారిపై కేసులు బనాయించడం దారుణమని విమర్శించారు. పౌరహక్కుల సంఘం  రాష్ట్ర నాయకుడు ఎ¯ŒS.శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఆక్వా పార్క్‌ నిర్మాణం వద్దం టున్న ప్రజలపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి అక్రమ అనుమతులిచ్చిన మంత్రులపైన, అధికారులపైన కేసులు పెట్టాలన్నారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ  పచ్చటి పొలాల మధ్య కాలుష్యం వెదజల్లే ఆక్వా పార్క్‌కు వ్యతిరేకంగా సాగిస్తున్న ఉద్యమానికి అందరి మద్దతు ఉంటుందన్నారు. సీపీఐఎంఎల్‌ (న్యూ డెమోక్రసీ) నాయకుడు సురేష్‌ మాట్లాడుతూ ఆక్వా పార్క్‌ నిర్మాణాన్ని 99 శాతం ప్రజలు వద్దంటుంటే ప్రభుత్వం, యాజమాన్యం మొండిగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. ఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీ నాయకుడు సుందరరామరాజు మాట్లాడుతూ   వ్యవసాయ జోన్‌లో  విషం కక్కే ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి జనజీవనంతో చెలగాటమాడటం దారుణమన్నారు. దళిత సంఘం నాయకుడు ఫ్రాన్సిస్‌ మాట్లాడుతూ రాజధాని అమరావతిలో కూలీలు, ప్రజలు పడుతున్న కష్టాలు తుందుర్రు ప్రాంత ప్రజలకు తప్పలేదన్నారు. ఇక్కడి ఉద్యమాన్ని తాము కూడా స్ఫూర్తిగా తీసుకుంటామని మహిళలకు అభినందనలు తెలిపారు. ఈ సభలకు పెద్దఎత్తున హాజరైన మహిళలు, విద్యార్థులు ఆక్వాపార్క్‌ నిర్మాణాన్ని నిలిపివేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామంటూ నినాదాలు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్, డివిజన్‌ నాయకుడు జేఎన్‌వీ గోపాలన్‌, రైతు సంఘం నాయకుడు ఎం.నాగరాజు, వైఎస్సార్‌ సీపీ నాయకులు తిరుమాని ఏడుకొండలు, పేరిచర్ల సత్యనారాయణరాజు, ఎంపీటీసీ జవ్వాది వెంకటరమణ, ఆక్వాపార్క్‌ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఆరేటి వాసు, ముచ్చర్ల త్రిమూర్తులు, జవ్వాది సత్యనారాయణ, బీవీ వర్మ పాల్గొన్నారు. 
 

 

మరిన్ని వార్తలు