మీరు విపక్షంలో ఉంటేనే జనానికి మేలు

4 Jan, 2017 02:23 IST|Sakshi
మీరు విపక్షంలో ఉంటేనే జనానికి మేలు

కాంగ్రెస్‌పై కడియం చెణుకులు
ఎవరెక్కడో ప్రజలే నిర్ణయిస్తారు: షబ్బీర్‌
మండలిలో నవ్వులు పూయించిన చర్చ


సాక్షి, హైదరాబాద్‌: ‘చేపలపై చర్చ’ సందర్భంగా మంగళవారం శాసనమండలిలో అధికార, విపక్ష సభ్యుల మధ్య నవ్వులు విరిశాయి. మత్స్య పరిశ్రమపై లఘు చర్చ సందర్భంగా విపక్ష నేత షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ, తనకు కూడా ఆ శాఖ మంత్రిగా పని చేసిన అనుభవముందని గుర్తు చేశారు. మత్స్యకారులకు వలలు, పడవలు ఇవ్వాలని సూచించారు. చెరువుల్లో చేప పిల్లలను వదిలి సరిపెట్టకుండా మెరుగైన మార్కెట్‌ సౌకర్యాలు, ఐస్‌ బాక్స్, డీప్‌ ఫ్రీజర్‌ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా, ‘మీ (కాంగ్రెస్‌) హయాంలో మీరెందుకు అవన్నీ చేయలేకపోయారని కడియం మమ్మల్ని ప్రశ్నించబోతున్నారు’ అని షబ్బీర్‌ వ్యాఖ్యానించారు.

దాంతో, తానేం చెప్పబోతున్నానో కేవలం తన ముఖ కవళిక చూసే విపక్ష నేత పట్టేశారంటూ కడియం చమత్కరించారు. ఈ చర్చను గమనించిన సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజలకు లాభం జరిగేలా ఉందని తనతో అన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉండి టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని తనకూ అనిపిస్తోందన్నారు. దాంతో షబ్బీర్‌ స్పందిస్తూ, ‘మీ కోరికను మీ దేవుడికి విన్నవించుకోండి. మేం మా అల్లాను కోరుకుంటాం. చివరకు ప్రజలు, భగవంతుడే తేలుస్తారు’ అని అన్నారు. ‘‘పాలన కాంగ్రెస్‌కు కొత్త కాదు. ఐదారు దశాబ్దాల పాటు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో కొనసాగిన చరిత్ర మాది’’ అని చెప్పుకొచ్చారు. ఈ చర్చను అధికార, విపక్ష సభ్యులు ఆద్యంతం చిరునవ్వులతో ఆస్వాదించారు.

>
మరిన్ని వార్తలు