కడియపులంకలో గుబాళించనున్న ఆధ్యాత్మికత

26 Apr, 2017 22:57 IST|Sakshi
కడియపులంకలో గుబాళించనున్న ఆధ్యాత్మికత
– బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వేంకటరమణశాస్త్రి 
-28న షిర్డీసాయి, 30న వేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠాపనలు
కడియం (రాజమహేంద్రవరం రూరల్‌) : మండలంలోని కడియపులంక గ్రామం హరిహరక్షేత్రంగా భాసిల్లుతుందని బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వేంకటరమణశాస్త్రి అన్నారు. కడియపులంకలోని శ్రీ అపర్ణాసమేత అనంతేశ్వరస్వామి పంచాయతనక్షేత్రం ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 30న విగ్రహ ప్రతిష్ఠాపనలు జరుగుతాయని, 28న శ్రీ షిర్డి సాయినాథుని విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతుందని చెప్పారు. ఆలయ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించిన ఆయన స్థానిక ఆలయ కమిటీ, భక్తులతో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.కోటికి పైగా భక్తుల విరాళాలతో ఆలయం రూపుదిద్దుకుందన్నారు. హరిహరుల ఆలయాలు పక్కపక్కనే నిర్మితమైన ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి జన్మనక్షత్రమైన మృగశిర నక్షత్రంలో స్వామివారి ప్రతిష్ఠాపన జరుగుతుందన్నారు. శంకర జయంతి, రామానుజాచార్య సహస్ర జయంతి తదితర ప్రాధాన్యమైన రోజుల్లోనే ప్రతిష్ఠాపనకు నిర్ణయించడం విశిష్టతను సంతరించుకుందన్నారు. తొలి దర్శనానికి పలువురు పీఠాధిపతులను ఆహ్వానించినట్లు  తెలిపారు. 30న మధ్యాహ్నం 12 గంటల తరువాత స్వామివారి దర్శనానికి అనుమతిస్తారని తెలిపారు. అనేక విగ్రహ ప్రతిష్ఠాపనలు చేసిన శ్రీమాన్‌ నల్లాన్‌చక్రవర్తుల సంతోషాచార్యుల బ్రహ్మత్వంలో ఈ ప్రతిష్ఠాపనలు జరుగుతాయన్నారు.  ఏర్పాట్లను ఆలయ నిర్మాణ కమిటీ, గ్రామ భక్తజనులు పర్యవేక్షిస్తున్నారన్నారు. 
మరిన్ని వార్తలు