వైభవంగా నృసింహుని అంకురార్పణ

7 Mar, 2017 22:38 IST|Sakshi
వైభవంగా నృసింహుని అంకురార్పణ

- భారీగా తరలివచ్చిన భక్తులు
- నేడు కల్యాణోత్సవం
- ముమ్మరంగా ఏర్పాట్లు


కదిరి : ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో వైభవంగా అంకురార్పణ చేశారు. పక్షం రోజుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు అష్టదిక్పాలకులను ఆహ్వానించేందుకు నిర్వహించినదే ఈ అంకురార్పణ ఘట్టమని ఆలయ ప్ర«ధాన అర్చకులు నరసింహాచార్యులు, పార్థసారథి ఆచార్యులు పేర్కొన్నారు. మంగళ వాయిద్యాల మధ్య రాత్రి 9 గంటల ప్రాంతంలో నరసింహుడు ఆలయానికి నైరుతి దిశలో ఉన్న మండపాన్ని చేరుకున్నారు. నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమిపూజ’తో మట్టిని సేకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. యాగశాలలో ఆ మట్టితో నింపిన 9 పాలికల్లో నవధాన్యాలతో అంకురార్పణ గావించారు. ఈ నవధాన్యాలు దిన దినాభివృద్ధి చెందేలా అర్చకులు బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకూ ప్రతిరోజూ నీరు పోసి పచ్చగా మొలకెత్తేలా చూస్తారు. ఏ ధాన్యం బాగా మొలకెత్తుతుందో ఆ పంట ఈ యేడు బాగా పండుతుందనేది భక్తుల నమ్మకం.

ఉత్సవాలను నలుదిక్కులా చాటడానికి బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రధాన «ధ్వజ స్తంభానికి గరుడ దండాన్ని «ధ్వజారోహణం గావిస్తారు. దీన్ని బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేరోజు అంటే తీర్థవాది రోజు శ్రీవారి చక్రస్నానం అనంతరం అవరోహణం గావించి ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. నారసింహుడు సైతం ఈ పక్షం రోజుల పాటు యాగశాలలోనే గడిపి, ఇక్కడి నుండే తన భక్తులకు దర్శనభాగ్యం కల్గిస్తారు. బెంగళూరుకు చెందిన కేఎన్‌ నాగేశ్వర్‌రావు కుటుంబీకులు శ్రీవారి అంకురార్పణానికి ఉభయదారులుగా వ్యవహరించినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ పచ్చిపులుసు నరేంద్రబాబు, ఆలయ సహాయ కమిషనర్‌ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మోటారు వాహనాల తనిఖీ అధికారి చిర్రారెడ్డి శేషాద్రిరెడ్డి, పాలక మండలి సభ్యులు ఇద్దే రఘునాథరెడ్డి, మోపూరిశెట్టి చంద్రశేఖర్, తేపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కాటమరాయుడి కల్యాణం చూతము రారండి
లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న శ్రీవారి కల్యాణోత్సవం బుధవారం రాత్రి అత్యంత వైభవంగా జరుగనుంది. ఇందుకోసం పాలక మండలితో పాటు ఆలయ, పోలీసు అధికారులు భారీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి కల్యాణవేదిక 6 అడుగుల ఎత్తులో వేదిక సిద్ధం చేస్తున్నారు. వేదికపై కేవలం అర్చకులు మాత్రమే కూర్చునే విధంగా నిర్ణయం తీసుకున్నారు.

రాత్రి 8.30 గంటలకు వేదికౖపైకి..
యాగశాల నుంచి నవ వధువులుగా అలంకృతులై శ్రీదేవి, భూదేవిలతో పాటు వరుడు ఖాద్రీ లక్ష్మీ నరసింహుడు బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో పల్లకీలో ఆలయ ప్రాంగణలో ఉన్న కల్యాణ మండపం చేరుకుంటారు.

తూర్పు గోపురం గుండా..
ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. భక్తులు ఆలయంలోకి తూర్పు రాజగోపురం గుండా ప్రవేశించి, పశ్చిమ గోపురం గుండా వెలుపలకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు