కార్పొరేషన్‌ ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ కసరత్తు

6 Aug, 2017 23:52 IST|Sakshi
కార్పొరేషన్‌ ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ కసరత్తు
హాజరైన పార్టీ సీనియర్‌ నేతలు
కాకినాడ : త్వరలో జరగనున్న కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ప్రారంభించింది. నగరంలోని అన్ని డివిజన్లలోను పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఎన్నికలకు సంబంధించి కార్పొరేటర్‌ అభ్యర్థుల ఎంపిక, విజయావకాశాలు, ఇతర అంశాలపై రోజంతా చర్చించారు. స్థానిక సరోవర్‌ పోర్టికోలో జరిగిన ఎన్నికల సమీక్షలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హాజరయ్యారు. కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి గడిచిన మూడు రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనపై నేతలు చర్చించారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చించారు. సమర్థులైన, పార్టీ కోసం కష్టించి పని చేసే వారిని గుర్తించి టిక్కెట్లు ఇచ్చే విషయంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు కసరత్తు చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పార్లీమెంట్‌ కో–ఆర్డినేటర్‌ చలమలశెట్టి సునీల్, మాజీ ఎమ్మెల్యే, కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్‌ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, సినీ కో–ఆర్డినేటర్‌ ముత్తా శశిధర్‌లతో కూడా చర్చించారు. ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని నిర్ణయించారు. అలాగే నామినేషన్ల ప్రక్రియ అనంతరం చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలపై కూడా నాయకులు చర్చించుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై నెలకున్న తీవ్రమైన వ్యతిరేకతతోపాటు ఇటీవల జాతీయ ప్లీనరీలో ప్రకటించిన నవరత్న పథకాలపై కూడా ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోందని, పార్టీ విజయావకాశాలు మెండుగా ఉన్నాయన్న విషయాన్ని నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా కార్పొరేషన్‌ ఎన్నికల నేపద్యంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈ నెల 12 నుంచి 29 వరకూ కాకినాడలోనే అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 
మరిన్ని వార్తలు