తొలి అంకానికి నేడే తెర

10 Aug, 2017 00:03 IST|Sakshi
తొలి అంకానికి నేడే తెర
-నామినేషన్ల దాఖలుకు నేడు చివరిరోజు
 -టీడీపీ, బీజేపీల మధ్య తేలని సఖ్యత 
-వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో స్పష్టత!
కాకినాడ :  కార్పొరేషన్‌ ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఖరారుపై రాజకీయపార్టీలలో ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల ఎంపికపై పార్టీలకు ఇంకా స్పష్టత రాకపోవడంతో.. ఎందరో ఆశావహులు కార్పొరేటర్‌ పదవులకు ఆశావహులు ముందుగానే తమ తమ పార్టీల తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. గడచిన మూడు రోజుల్లో 112 నామినేషన్లు పడ్డాయి. డివిజన్ల పునర్విభజన నేపథ్యంలో గతంలో పోటీ చేసిన ప్రాంతాలు తారుమారు కావడం, రిజర్వేషన్లు మారడం, అకస్మాత్తుగా ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను ప్రకటించడంతో చాలా చోట్ల అభ్యర్థుల ఎంపిక రాజకీయ పార్టీలకు కొంత తలనొప్పిగా మారింది.
నేడు వైఎస్సార్‌ సీపీ జాబితా!
అభ్యర్థుల ఎంపికకు సంబంధించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చాలా వరకూ స్పష్టత వచ్చిందని పార్టీ వర్గాల సమాచారం. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కాకినాడలోనే ఉండి పార్టీనేతలతో చర్చించి, సర్వే ద్వారా సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసే అంశంపై గడచిన నాలుగు రోజులుగా ముమ్మరంగా కసరత్తు చేశారు. నాయకులను సమన్వయం చేసుకుంటూ సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేయడం ద్వారా కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికకు చేసిన కసరత్తు కొలిక్కి వచ్చిందంటుని, గురువారం జాబితాను విడుదల చేయవచ్చని పార్టీ వర్గాలంటున్నాయి.
ఎంపికలు ఏకపక్షమని టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు!
అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో గందరగోళం నెలకొంది. కష్టపడి పనిచేసేవారికి టిక్కెట్లు దక్కడం లేదని కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఏకపక్షంగా అభ్యర్థులను ఎంపిక చేశారంటూ కొంతమంది అధిష్టానానికి ఫిర్యాదు చేశారంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.కళావెంకట్రావు, జిల్లా మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప జోక్యం చేసుకుని జాబితాపై మరోసారి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితి కొన్ని డివిజన్లలో ఉందని, చాలా డివిజన్లలో పోటీ చేసేందుకు  సరైన అభ్యర్థులు కూడా  దొరకని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.
కనీసం 12 ఇవ్వాలంటున్న ‘కమలం’
  కాగా బీజేపీతో పొత్తు విషయంలో కూడా టీడీపీలో సందిగ్ధం తొలగలేదు. కనీసం 20 టిక్కెట్లు కావాలని బీజేపీ పట్టుబడుతుండగా మూడు సీట్లకు మించి ఇవ్వలేమంటూ టీడీపీ చెప్పిందంటున్నారు. దీంతో ఇరుపార్టీల మధ్య నెలకొన్న వివాదానికి తెరదించేందుకు మంత్రులు రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. ఆర్థిక మంత్రి యనమల, హోంమంత్రి రాజప్ప బుధవారం బీజేపీకి చెందిన మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజులతో జరిపిన చర్చలు బెడిసికొట్టాయంటున్నారు. కనీసం 12 స్థానాలైనా ఇవ్వాలంటూ బీజేపీ నేతలు చివరి డిమాండ్‌గా టీడీపీ ముందుంచారని చెపుతున్నారు. పొత్తు వ్యవహారం తేలకపోవడం కూడా టీడీపీ అభ్యర్థుల జాబితా  రూపొందకపోవడానికి ఆటంకంగా మారిందంటున్నారు. 
నేడు భారీగా నామినేషన్లకు అవకాశం
నామినేషన్ల ఘట్టానికి గురువారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు పడనున్నాయి. గురువారం అన్ని రాజకీయ పార్టీల నుంచీ ఎందరో అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. మొత్తం మీద కార్పొరేషన్‌ ఎన్నికల కాక గురువారంతో మరింత పెరగనుంది.
మరిన్ని వార్తలు