కాకినాడ ప్రభుత్వాస్పత్రి రూటే సప‘రేట్‌’

12 Nov, 2016 22:42 IST|Sakshi
కాకినాడ ప్రభుత్వాస్పత్రి రూటే సప‘రేట్‌’
  • బాబు పుడితే రూ.1200, పాప పుడితే రూ.800 
  • సిబ్బంది అక్రమ వసూళ్లు
  • ఆవేదన చెందుతున్న బాలింతల బంధువులు
  • చోద్యం చూస్తున్న వైద్యాధికారులు
  • కాకినాడ వైద్యం: 
    ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఫీజులు చెల్లించే స్తోమత లేక ప్రభుత్వాస్పత్రికి వస్తుంటే... ఇక్కడా దోపిడీ దందా సాగుతోందని రోగులు వాపోతున్నారు. ఆస్పత్రిలో చేరిన దగ్గర నుంచి ఇంటికెళ్లే దాకా ప్రతీ పనికి రోగుల నుంచి ముక్కుపిండి మరీ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇందులో మాతా, శిశు విభాగంలో ప్రసవాల కోసం వచ్చిన వారికి బిడ్డకో రేటు పెట్టేశారు. మగబిడ్డకు రూ.1,200లు, ఆడబిడ్డకు రూ.700–800లు వసూలు చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు ఆందోళన వ్యక్తం చేశారు.  కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మాతా, శిశు విభాగంలో పోస్ట్‌ గైనిక్, ప్రీ గైనిక్, లేబర్, ఎస్‌ఎల్‌ఆర్, జీఐసీ యూ వార్డులు ఉన్నాయి. ఇందులో ప్రసవాల కోసం సుమారు 180 దాకా పడకలు కేటాయించారు. వీటితో పాటూ ఎస్‌ఆర్‌ఎంటీ బ్లాక్‌లో అదనంగా మరో 60 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ గైనకాలజిస్ట్‌ల పర్యవేక్షణలో నెలకు 850–900 దాకా ప్రసవాలు జరుగుతుంటే ఇందులో 200 నుంచి 250 దాకా ఆపరేష¯ŒS లేకుండా నార్మల్‌ ప్రసవాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆధునిక వైద్య పరికరాలు, మెరుగైన వైద్య నిపుణులు ఉండటంతో ఈ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల కోసం ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా విశాఖ జిల్లా నుంచి కూడా గర్భిణులు ఇక్కడికి వస్తుంటారు. 
    ఫిక్సిడ్‌ రేట్లు
    ఆస్పత్రిలో చేరిన దగ్గర నుంచి ఆపరేష¯ŒS థియేటర్‌లోకి వెళ్లి, ప్రస వం అయిన తర్వాత బెడ్‌ మీదకు తీసుకువచ్చే దాకా ప్రతీ పనికి ఓ రేట్‌ ఫిక్స్‌ చేసి సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. బెడ్‌ మీద నుంచి ఆపరేష¯ŒS థియేటర్‌కు తీసుకెళ్లేందుకు స్ట్రక్చర్‌కు రూ.100, చీర మార్చేందుకు రూ.200, వార్డు గదిని శుభ్రం చేసేందుకు రూ.50 వసూలు చేస్తున్నారని బాధితులు తెలిపారు. మగబిడ్డ పుడితే రూ.1,200, ఆడబిడ్డ జన్మిస్తే రూ.800 ఇవ్వాలని పట్టుబడుతున్నారని, పేదవాళ్లం అంత డబ్బు ఇచ్చుకోలేమని ప్రాథేయపడినా అంగీకరించడం లేదని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ వసూళ్ల దందాపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 
     
    రూ.1200 వసూలు చేశారు
    నా భార్య ప్రసవం కోసం ఈ నెల 2న ఆస్పత్రిలో చేరింది. 3న మగబిడ్డ పుట్టాడు. ఆపరేష¯ŒS థియేటర్‌ సిబ్బంది మీకు బాబు పుట్టాడు, ఖర్చుల కోసం రూ.1,200 ఇవ్వాలని పట్టుబట్టారు. దూరప్రాంతం నుంచి వచ్చాం, అంత ఇచ్చుకోలేమని చెప్పినా వినలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సొమ్ము ఇచ్చాను.  
    – ఆర్‌.రాఘవ, దేవరపల్లి,  పశ్చిమగోదావరి జిల్లా
     
    సిబ్బందిపై చర్యలు తప్పవు
    ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నాం. రోగుల నుంచి సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు. డబ్బుల కోసం డిమాండ్‌ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలి. ఈ విషయమై విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటాం.
    – టి.ఎస్‌.ఆర్‌.మూర్తి, సీఎస్‌ఆర్‌ఎంఓ,  కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి
     
మరిన్ని వార్తలు