మాస్టర్‌‘ప్లాన్‌’ వేశారు

26 Mar, 2017 23:04 IST|Sakshi
మాస్టర్‌‘ప్లాన్‌’ వేశారు
- రూ.లక్షలు నొక్కేసి.. ఇష్టానుసారం పట్టాలు ఇచ్చేశారు
- చేతులు మార్చి అవే స్థలాలను నొక్కేసిన బినామీలు
- నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు
- సుప్రీంకోర్టు ఆదేశాలూ బేఖాతరు
- అధికార పార్టీ నేతల అండతో కాకినాడలో దందా
 
రోడ్డుకు అడ్డు వస్తున్నాయనే సాకుతో అనేక ప్రాంతాల్లో నిరుపేదల ఇళ్లను అధికారులు తొలగించేసినా కిమ్మనని అధికార పార్టీ ‘పెద్దలు’.. లక్షల రూపాయలు కొల్లగొట్టేందుకు మాస్టర్‌ ‘ప్లాన్‌’ వేశారు. నిబంధనలను, సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి.. కొందరు అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి.. మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్న రోడ్డును ఆనుకుని ఉన్న విలువైన స్థలంలో ఇష్టారాజ్యంగా ఇళ్ల పట్టాలు ఇచ్చేశారు. ముందే వేసిన పథకం ప్రకారం అవే పట్టాలను కొందరు బినామీలు చేజిక్కించుకున్నారు. కలెక్టర్‌ సహా జిల్లా అధికార యంత్రాంగమంతా కొలువుదీరిన కాకినాడ స్మార్ట్‌ సిటీయే ఈ దందాకు వేదికగా మారింది.
 
సాక్షి ప్రతినిధి, కాకినాడ : నగరంలోని 35వ డివిజన్‌ అది. అక్కడి బాలాజీనగర్‌ ఎర్రమట్టి రోడ్డును తాజాగా రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌లో 60 అడుగులుగా ప్రతిపాదించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆ రోడ్డును విస్తరించాలనే ప్రణాళిక ఉంది. ఆ రోడ్డును ఆనుకుని ఉన్న స్థలం కాకినాడ నగరపాలక సంస్థ ఆధీనంలో ఉంది. ఒకప్పుడు మెయిన్‌ రోడ్డు విస్తరణ కోసం స్థలం ఇచ్చిన తపాలా శాఖకు ప్రత్యామ్నాయంగా ఈ స్థలాన్ని ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా పెండింగ్‌లో ఉంది. అయితే నగరంలోని ఓ అధికార పార్టీ ముఖ్య నేత ఒత్తిళ్లతో ఈ ప్రతిపాదనను బుట్టదాఖలు చేశారు. రోడ్డును ఆనుకుని 50 గజాల వంతున నచ్చినవారికి నచ్చినట్టు అడ్డగోలుగా పట్టాలు ఇచ్చేశారు. ఆ ప్రాంతంలో గజం స్థలం రూ.20 వేలకు పైనే పలుకుతోంది. దీని ప్రకారం ఒక్కొక్కరికి ఇచ్చిన స్థలం విలువ రూ.10 లక్షల పైనే ఉంది. ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల ఆమ్యామ్యాలు తీసుకుని కార్పొరేషన్‌ స్థలాన్ని ఇష్టానుసారం బేరం పెట్టేశారు. పైగా ఆ స్థలాన్ని ఆనుకుని ఉన్న ఇంటి ప్రహరీని చేర్చి పట్టాలు ఇవ్వడంతో ఆ ఇంటి దారిని సైతం మూసివేసి నిర్మాణాలు ప్రారంభించేశారు. మరోపక్క పట్టాలు ఇచ్చిన స్థలానికి పొరుగున ఉన్న ఇళ్ళను రహదారి కోసం తొలగించాలని అధికారులు ఇటీవల నోటీసులు కూడా ఇచ్చారు. అటువంటప్పుడు ఆ పక్కనే పట్టాలు ఎలా ఇచ్చారో అర్థం కాని పరిస్థితి.
వాస్తవానికి రోడ్డు మార్జిన్లలో ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని 2002లో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా సామాజిక స్థలాలపై ఆయా స్థానిక సంస్థలకే సర్వాధికారాలూ ఉంటాయి. కానీ, మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించిన రోడ్డు మార్జిన్‌లోని స్థలంలో ఇళ్ల పట్టాలు ఎలా ఇచ్చారో జారీ చేసిన అధికారులకే తెలియాలి. ఇందులో మరో ట్విస్ట్‌ కూడా ఉంది. అడ్డగోలుగా మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్న రోడ్డులో పట్టాలు ఇవ్వడమే ఒక తప్పయితే పట్టాలు పొందినవారు కాకుండా, వారినుంచి కొనుగోలు చేసిన బినామీలు ఇప్పుడు అక్కడ నిర్మాణాలు ప్రారంభించడం గమనార్హం.
జగన్నాథపురంలోనూ అంతే..
జగన్నాథపురం 22వ డివిజన్‌ పరిధిలోని ధోబీçఘాట్‌ను ఆనుకుని గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇళ్ల పట్టాలు ఇప్పించేందుకు ప్రయత్నించారు. కానీ నిబంధనల ప్రకారం అలా ఇవ్వడం కుదరదని అప్పటి నగరపాలక సంస్థ కమిషనర్‌ అడ్డు చెప్పారు. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం నగర టీడీపీ నేతలు ముఖ్యనేతకు సిఫారసు చేయడంతో రూ.లక్షలు దిగమింగేసి, కార్పొరేషన్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చి, అదేచోట ఇళ్ల పట్టాలు కట్టబెట్టేశారు. ఇక్కడ సుమారు 30 వరకూ స్థలాలను ఇళ్ల పట్టాలుగా అమ్మేసుకున్నారు. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు.
సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం సత్తి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈ స్థలాల వివరాలు కోరగా, ఆ రోడ్లు మాస్టర్‌ప్లాన్‌లోనే ఉన్నాయని నగరపాలక సంస్థ పేర్కొంది. అటువంటప్పుడు కార్పొరేషన్‌కు తెలియకుండా రెవెన్యూ అధికారులు అక్కడ ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే.. అది రెండేళ్ల క్రితం జరిగిందంటూ కార్పొరేషన్‌ అధికారులు తప్పించుకుంటున్నారు.
పట్టాలున్నాయో లేవో పరిశీలిస్తున్నాం
బాలాజీనగర్‌ ఎర్రమట్టి రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదు వచ్చింది. ఆ ప్రాంతాన్ని 60 అడుగుల మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించడం వాస్తవమే. అందువల్ల నిర్మాణాలను నిలుపు చేస్తున్నాం. పట్టాలు ఉన్నాయా? లేవా? అనే అంశంపై విచారణ జరుపుతున్నాం.
- కాలేషా, సిటీప్లానర్, కాకినాడ నగరపాలక సంస్థ
అడ్డగోలుగా పట్టాల పంపిణీ
మాస్టర్‌ప్లాన్‌ రోడ్లలో సైతం ఇష్టం వచ్చినట్టుగా పట్టాలు పంపిణీ చేసేస్తున్నారు. ఎర్రమట్టి రోడ్డు స్థలం నగరపాలక సంస్థకు చెందినదని గతంలోనే స్పష్టం చేశారు. ఆ స్థలంలో కోర్టు నిర్ణయాలను సైతం పక్కన పెట్టి పట్టాలు ఇవ్వడం వెనుక ఉన్న రెవెన్యూ, కార్పొరేషన్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలి.
- చిట్నీడి మూర్తి, మాజీ కౌన్సిలర్, కాకినాడ
మరిన్ని వార్తలు