కలామ్‌కు విగ్రహం

27 Jul, 2016 01:32 IST|Sakshi
గాజువాక: భారతీయ క్షిపణి పితామహుడు, భారతరత్న, మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం స్ఫూర్తిని తన మదినిండా నింపుకున్న స్థానిక ట్వింకిల్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ ఏకంగా కలామ్‌ విగ్రహాన్ని తయారు చేయించారు. మిసైల్‌ మ్యాన్‌ మొదటి వర్థంతి సందర్భంగా దాన్ని తన పాఠశాల ఆవరణలో బుధవారం ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులంటే కలామ్‌కు అత్యంత ఇష్టమన్న విషయం తెలిసిందే. అందువల్ల ఆయన స్ఫూర్తిని ప్రతిరోజూ విద్యార్థులకు తెలిసేలా చేయడం కోసం పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద విగ్రహాన్ని ప్రతిషి్ఠంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికోసం మూడు అడుగుల ఎల్తైన పీఠం నిర్మించారు. ఆరు అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. ప్రతిషి్ఠంచిన తరువాత ఇది తొమ్మిది అడుగుల ఎత్తులో కనిపిస్తుంది. దీనికోసం స్టీల్, సిమెంట్, మార్బుల్‌ పౌడర్‌ను ఉపయోగించినట్టు పాఠశాల కరస్పాండెంట్‌ దొడ్డి శ్యామ్‌ తెలిపారు. ఇది జిల్లాలోనే తొలి విగ్రహమని పేర్కొన్నారు.
గుడి కడదామనుకున్నా...
‘విశాఖ జిల్లాలో కలామ్‌ తనకు అరుదైన గుర్తింపును ఇచ్చారని శ్యామ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘మా స్కూల్‌కు వచ్చి గంటా రెండు నిమిషాలు మా విద్యార్థులతో గడిపారు. మా స్కూల్‌కు వచ్చారు కాబట్టి ఆయన జ్ఞాపకాలను శాశ్వతంగా ఉంచుకోవడం కోసం ఈ ప్రయత్నం చేశాను. ఆయన రగిలించిన స్ఫూర్తిని విద్యార్థులందరిలోను రోజూ నింపడానికి ఈ ప్రయత్నం చేశాను. గురువు (కలామ్‌)కు గుడి కడదామనుకున్నాను. ప్రస్తుతానికి పరిస్థితులు అనుకూలించలేదు. ఆలస్యమైనా ఆలయం మాత్రం కడతాను. ఆయన పేరుమీద 50 మంది పేద విద్యార్థులను చదివిస్తున్నాను. దీనికోసం ఎవరివద్దా ఏ విధమైన సహకారం తీసుకోవడంలేదు. తమిళనాడులో స్మారక స్థూపం కడతామని ప్రకటించి కూడా కట్టకుండా వదిలేశారు. ఇది చాలా బాధగా ఉంద’ని శ్యామ్‌ పేర్కొన్నారు.
 
మరిన్ని వార్తలు