సేవకులకే సేవ..

5 Aug, 2016 19:19 IST|Sakshi
సేవకులకే సేవ..

సాక్షి,వీకెండ్: నిరాశ్రయులకు గూడు కల్పిస్తారు. అనాథలకు ఆశ్రయమిస్తారు. ఆపన్నులను ఆదుకుంటారు. అవసరార్థులకు ఆసరా అవుతారు. సేవా మార్గంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు సమాజ సేవలో తమదైన ముద్ర వేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులకు లోనవుతూ కూడా తమ బాధ్యత మరవడం లేదు. అలాంటి సంస్థలకు బాసటగా నిలుస్తామంటోంది కలశ ఫౌండేషన్‌.
                                                                      – ఎస్‌ సత్యబాబు

‘ఒక మంచి ఆశయంతో ఏర్పడిన సేవా సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది మనుగడ కోల్పోవడం అంటే దాని నీడలో ఆశ్రయం పొందుతున్న ఎందరో అభాగ్యులు వీధిన పడడమే. అంతేకాదు స్వచ్ఛంద సేవా స్ఫూర్తికి భంగం కలగడం కూడా’ అంటారు కలశ ఫౌండేషన్‌ ప్రతినిధులు. బంజారాహిల్స్‌లోని మెంటార్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కార్పొరేట్‌ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాౖటెన ఈ ఫౌండేషన్‌ కార్యకలాపాల గురించి సంస్థ ప్రతినిధులు చెప్పిన విశేషాలు వారి మాటల్లోనే...

సేవా స్ఫూర్తి వర్ధిల్లాలి..
స్వచ్ఛంద సేవా స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, జవసత్వాలు కోల్పోయిన ఎన్‌జీఓలకు ప్రాణం పోయడానికి కలశ ఆవిర్భవించింది. ఎన్జీఓలకు సేవ చేసే ఎన్జీఓగా మారాలనేది లక్ష్యం. ఒక సేవా సంస్థ ప్రారంభమవడం కాదు... అది కొనసాగడం ముఖ్యం. ఆ క్రమంలో మేం వారి కష్టాల్ని పంచుకుంటాం. అలాగే ఎవరైనా కొత్తగా ఎన్జీఓ నెలకొల్పడానికి అవసరమైన సాయం కూడా చేస్తాం. ఇబ్బందుల్లో ఉన్న సంస్థలను ఆదుకునేందుకు మా వంతు సహకారం అందజేస్తాం. దాతలను ఒప్పించి విరాళాలు అందేలా ప్రయత్నిస్తాం. దీని కోసం ఎన్జీఓ సంస్థల డేటా రూపొందించాం. వాటి స్థితిగతులు విశ్లేషిస్తున్నాం.

మన సిటీలో చేయూత అవసరమైన ఎన్జీఓలు 1742 ఉన్నాయని గుర్తించాం. వీటిలో వికలాంగులు, వృద్ధులు, అనాథలు, నిరాశ్రయులు, పర్యావరణ కోసం, వేశ్య వృత్తి నుంచి బయటపడిన వారి కోసం పనిచేస్తున్నవి.. ఇలా 9 క్లస్టర్స్‌గా విభజించాం. వీటిలోనూ అన్ని రకాలుగా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రిటర్న్‌్స దాఖలు చేస్తున్న వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఆశ్రయ్‌ ఆకృతి, గ్రీన్‌లేస్, పీపుల్స్‌ పవర్‌ (విశాఖ కేంద్రంగా పనిచేస్తోంది)లలో కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాం. వచ్చే వారం సాయినేత్ర ఫౌండేషన్‌లోనూ నిర్వహించనున్నాం.

సామాజిక బాధ్యత...
మెంటార్‌ కన్సల్టింగ్‌ కార్పొరేషన్‌ సామాజిక బాధ్యతలో భాగంగా భాగంగా ఈ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్నాం. చాలా వరకూ సంస్థకు సంబంధించిన లాభాల నుంచే దీనికి ఖర్చు చేస్తున్నాం. దీనికి తోడు కంపెనీ ఉద్యోగులు తమ జీతాల్లో నుంచి రూ.100 మొదలుకుని ప్రతి నెలా వారి వారి స్థాయిల్లో డొనేట్‌ చేస్తున్నారు. తినడానికి తిండి లేకపోయినా భుజం తట్టే వాళ్లు ఉంటే చాలని మదర్‌ థెరిస్సా అన్నారు. ఆ భుజం తట్టే చేయి మాది కావాలనే తపన. ఇదే కాకుండా మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నాం.

పలు అంశాలపై అవగాహన కోసం రన్‌లు, పబ్లిక్‌ క్యాంపెయిన్‌లు నిర్వహించనున్నాం. అలాగే రాజకీయ నేతల్లో చాలా మంది మంచివారున్నారు. ప్రజల కోసం నిస్వార్థంగా పని చేస్తున్నవారున్నారు. అందరూ అవినీతి పరుల గురించే మాట్లాడతారు గానీ వీరిని పట్టించుకోరు. అందుకే అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహించాలనే ఆలోచనతో ‘చాణక్య’ అవార్డులు అందజేయనున్నాం.

గమనిక: ఇబ్బందుల్లో కూడా సేవా దృక్పథంతో ఎన్జీఓలను కొనసాగిస్తున్న వారు మమ్మల్ని సంప్రదించొచ్చు.
              మెయిల్‌ ఐడీ: info@mcmcpl.com
 

మరిన్ని వార్తలు