కాళేశ్వరానికి తొలి అడుగు

2 May, 2016 05:58 IST|Sakshi
కాళేశ్వరానికి తొలి అడుగు

నేడు మేడిగడ్డ వద్ద భూమి పూజ చేయనున్న సీఎం
పాజెక్టుతో కొత్తగా 18 లక్షల ఎకరాలకు నీరు..
12 లక్షల ఎకరాల స్థిరీకరణ
రూ. 69,581.33 కోట్ల వ్యయం
4,500 మెగావాట్ల విద్యుత్ అవసరం
185 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీల నిర్మాణం
రెండేళ్లలో మల్లన్నసాగర్‌కు నీరివ్వాలని లక్ష్యం

 
సాక్షి, హైదరాబాద్: నీటి కరువుతో అల్లాడుతున్న ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సోమవారం తొలి అడుగు పడనుంది. ఉదయం మేడిగడ్డ బ్యారేజీ వద్ద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భూమి పూజ చేయనున్నారు. 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 12 లక్షల స్థిరీకరణ లక్ష్యంగా ఈ ప్రాజెక్టు పురుడు పోసుకుంటోంది. 2017 నాటికి మెజార్టీ పనులను పూర్తి చేసి మల్లన్నసాగర్ రిజర్వాయర్ వరకు పనులను పూర్తి చేసి సుమారు 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం సంకల్పించింది.
 
పూర్తి స్థాయి లభ్యత!: ప్రాణహిత-చేవెళ్ల రీడిజైనింగ్‌లో భాగంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న నీటి లభ్యత, అంతర్రాష్ట్ర సమస్యలు, ఆయకట్టు లక్ష్యాలు ఇప్పటికే కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రాణహిత పాత డిజైన్‌లో ఉన్న తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతతో పోలిస్తే మేడిగడ్డ వద్ద  లభ్యత ఎక్కువగా ఉన్నందున నిర్ణీత 160 టీఎంసీల నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తమ్మిడిహెట్టి వద్ద 1,144.8 టీఎంసీల సరాసరి లభ్యత ఉండగా.. కాళేశ్వరం వద్ద 1,651 టీఎంసీల లభ్యత ఉంటుంది.

తమ్మిడిహెట్టి నిల్వ సామర్థ్యం 5 టీఎంసీలు అయితే.. మేడిగడ్డ వద్ద సామర్థ్యం 101 మీటర్ల ఎత్తులో 19 టీఎంసీలుగా ఉండనుంది. ఇక్కడ్నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశముందని ప్రభుత్వం చెబుతోంది. ప్రాణహిత డీపీఆర్ మేరకు తమ్మిడిహెట్టి నుంచి రంగారెడ్డికి నీటి మళ్లించే క్రమంలో మొత్తంగా 10 రిజర్వాయర్లను 16 టీఎంసీల సామర్ధ్యంతో చేపట్టాలని నిర్ణయించగా.. ఇప్పుడు ఏకంగా 185 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు, బ్యారేజీలు ప్రతిపాదించారు.

వీటి ద్వారా 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడంతోపాటు మరో 12 లక్షల ఎకరాలను స్థిరీకరించి మొత్తంగా 30 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు 4,500 మెగావాట్ల విద్యుత్ అవసరాలు ఉండగా.. ప్రాజెక్టుకు రూ.69,581.33 కోట్ల ఖర్చవుతుందని లెక్కగట్టారు. వచ్చే ఏడాది జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీరు ఆయకట్టుకు పారేలా ప్రణాళిక ఉండాలని ప్రభుత్వం అధికారులకు మార్గదర్శనం చేసింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ వరకు అన్ని పనులను పూర్తి చేయడం, వీలైనంత నీటిని నిల్వ చేసుకోవడం, తక్షణమే కనీసం 5 లక్షల ఎకరాలకు నీరందించడం వంటి లక్ష్యాలను నిర్దేశించింది. ప్రాజెక్టు పరిధిలో కాల్వలు, రిజర్వాయర్లు, టన్నెళ్ల పనులన్నీ ఏకకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ముంపు లెక్కలు కొలిక్కి..
మేడిగడ్డ బ్యారేజీతో మహారాష్ట్రలో ఉండే ముంపు ఎంతో తేలింది. 102 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే 399 హెక్టార్లు, 101.5 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 315 హెక్టార్లు, 101 మీటర్ల ఎత్తులో 240 హెక్టార్లు, 100 మీటర్ల ఎత్తులో 83 హెక్టార్ల ముంపును నిర్ధారించారు. ఇందులో 102 మీటర్లు, 101 మీటర్ల ఎత్తులో పెద్దగా ముంపు లేనందున ఈ ఎత్తులను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రను కోరే అవకాశం ఉంది. ఒకవేళ 102 మీటర్ల ఎత్తుకు అంగీకరిస్తే బ్యారేజీ నిల్వ సామర్ధ్యం 22 టీఎంసీలు ఉండనుంది. 101 మీటర్లకు పరిమితమైతే 19.73 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటుంది.

మేడిగడ్డ ముంపు సర్వే కొలిక్కి రావడం, తమ్మిడిహెట్టిపై ఇప్పటికే ఏకాభిప్రాయం ఉన్న నేపథ్యంలో బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి ఈ వారంలోనే తెలంగాణ, మహారాష్ట్రల మధ్య మరో దఫా చర్చలు జరగనున్నాయి. అధికారుల స్థాయిలో చర్చలు ముగించి, ఈ నెలలోనే ముఖ్యమంత్రుల స్థాయిలో ఏర్పాటైన అంతరాష్ట్ర బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేసింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమయం ఇచ్చిన వెంటనే ఒప్పందాల ప్రక్రియ ముగించి, మేడిగడ్డ బ్యారేజీకి అధికారికంగా శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
కాళేశ్వరం ద్వారా జిల్లాల వారీగా ప్రతిపాదిత ఆయకట్టు ఇదీ..
 జిల్లా            ఆయకట్టు
 ఆదిలాబాద్    1,00,000
 నిజామాబాద్    4,54,500
 కరీంనగర్        2,01,449
 మెదక్        7,30,646
 వరంగల్        20,595
 నల్లగొండ        2,62,360
 రంగారెడ్డి        50,000
 మొత్తం        18,19,550
(దీంతోపాటు 11,80,450 ఎకరాలను స్థిరీకరించనున్నారు. ఈ లెక్కన మొత్తం ఆయకట్టు 30 లక్షల ఎకరాలవుతుంది)
 
కాళేశ్వరం రిజర్వాయర్‌లు, సామర్థ్యాలు ఇలా..
 రిజర్వాయర్    సామర్థ్యం(టీఎంసీల్లో)
 మేడిగడ్డ (101మీటర్లు)19.73
 అన్నారం    6.22
 సుందిళ్ల        2.16
 పత్తిపాక    5.50
 మలక్‌పేట    3
 అనంతగిరి    3.50
 ఇమామాబాద్    2.50
 మల్లన్నసాగర్    50
 కొండపోచమ్మ    21
 బస్వాపూర్    14.16
 గంధమల    9.87
 మోతె    2.90
 గుజ్జుల    1.50
 కాటేవాడి    5
 తడమడ్ల    5
 తిమ్మక్కపల్లి    3
 ఖాచాపూర్    2.50
 ఇసాయిపేట    2.50
 మంచిప్ప    5
 హైదరాబాద్ నీటిసరఫరా    20
 మొత్తం        185.19

కాళేశ్వరం ద్వారా వివిధ కింద స్థిరీకరణ ఇలా (టీఎంసీల్లో)
 ఎల్లంపల్లి    20
 మిడ్‌మానేరు    25
 ఎల్‌ఎండీ    25
 నిజాంసాగర్    17
 సింగూరు    29
 ఎస్సారెస్పీ    80
 గౌరవెల్లి        9
 గండిపల్లి    1.50
 మొత్తం     206.50

మరిన్ని వార్తలు