ఆయన కవితలే ఆయుధాలు

9 Sep, 2016 23:14 IST|Sakshi
రవీంద్రభారతిలో చిందేసిన గోరటి

హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్‌:    ప్రజాకవి ‘కాళోజీ నారాయణరావు’ జీవితం ఎంతో విశాలమైందని, ఆయన జీవితాంతం ప్రజాస్వామిక ఉద్యమాల్లో కీలకపాత్ర పోషిస్తూ యువతలో ఉద్యమ స్ఫూర్తిని నింపారని శాసన సభ స్పీకర్‌ మధుసూధనాచారి అన్నారు. తెలంగాణ బాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవం–కాళోజీ జయంతిని పురస్కరించుకుని ‘‘తెలంగాణ భాషా పరిరక్షణ–రచయితలు–భాషావేత్తల కర్తవ్యం’’ అంశంపై తెలుగు అకాడమిలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా‘సాక్షి’ దినపత్రిక కార్టునిస్ట్‌ శంకర్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం స్పీకర్‌మాట్లాడుతూ ఉద్యమాల్లో కాళోజీ తన కవితలనే ఆయుధాలుగా మలుచుకున్నారన్నారు. తెలంగాణ తెలుగు యాసను బతికించేందుకు ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ కాళోజీ సమాజిక పరిస్థితులపై తన కవిత్వంతో ఎండగట్టే వారన్నారు. నందిని సిదారెడ్డి మాట్లాడుతూ ఆధిపత్య భావనలపై తిరుగుబాటులో ఆయన ప్రహ్లాద పాత్రను ఆదర్శంగా తీసుకున్నారన్నారు. కార్యక్రమంలో ఆచార్య రివ్వాశ్రీహరి, సత్యనారాయణరెడ్డి, డాక్టర్‌ గంటా జలందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

సాహిత్యమే ఆయన ఊపిరి
 కాళోజీ నారాయణరావు సాహిత్యమే ఉపిరిగా జీవించారని ప్రముఖ కవి, రచయిత డాక్టర్‌ అమ్మంగి వేణుగోపాల్‌ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కాళోజి జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ గ్రంధాలయ ఉద్యమంతో మొదలైన ఆయన తెలంగాణా రైతాంగ పోరాటం, తొలిదశ తెలంగాణ ఉద్యమం, పౌర హక్కుల ఉద్యమంలో కీలకపాత్ర పోషించారన్నారు. కాళోజీ వాడిన పదాలు అన్వయిస్తూ  తెలంగాణా బాషా నిఘంటువును రూపొందించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ఈ సందర్బంగా ఆయనను విశ్వవిద్యాలయ యాజమాన్యం సత్కరించింది. కార్యక్రమంలో వీసీ సీతారామరావు తదితరులు పాల్గొన్నారు.  

 

మరిన్ని వార్తలు