కల్యాణ వైభోగమే

10 May, 2017 00:21 IST|Sakshi
కల్యాణ వైభోగమే
ద్వారకాతిరుమల:  శ్రీనివాసుడు సర్వాభరణ భూషితుడై నుదుటిన కల్యాణ తిలకం, బుగ్గన చుక్కతో ఉభయ దేవేరులను పెళ్లాడాడు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హేవిళంబి నామ సంవత్సర వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి కల్యాణం కనుల పండువగా జరిపించారు. అంతకుముందు ఉదయం సింహ వాహనంపై ఉభయ దేవేరులతో ఆశీనులైన శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. అట్టహాసంగా జరిగిన ఈ తిరువీధిసేవను భక్తులు ఆసక్తిగా తిలకించారు.  
ఆకర్షణీయంగా కల్యాణ వేదిక
శ్రీవారి ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై చినవెంకన్న తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. కల్యాణ వేదికను ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. అనంతరం ఆలయంలో తొళక్క వాహనంపై శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ మూర్తులను ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. తర్వాత ఆలయ అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ మేళతాళాలు, మంగళవాయిద్యాలతో శ్రీవారి వాహనాన్ని కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. వేదికపై ప్రత్యేకంగా అలంకరించిన రజత సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి అర్చకులు కల్యాణ తంతును ప్రారంభించారు. శుభముహూర్త సమయంలో వధూవరుల శిరస్సులపై జీలక్రర్ర, బెల్లం ధరింపజేసి మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకను భక్తుల గోవింద నామస్మరణల నడుమ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం తరపున శ్రీవారికి ఆలయ చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు పట్టువస్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు  సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఏర్పాట్లను ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు పర్యవేక్షించారు. 
ఆకట్టుకున్న గరుడోత్సవం
శ్రీవారి కల్యాణ తంతు ముగిసిన అనంతరం వెండి గరుడ వాహనంపై స్వామి ఉభయదేవేరులతో క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు.  స్వామికి గరుడ నిత్య సేవకుడు. అటువంటి గరుడ వాహనంపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చినవెంకన్న ఉభయ దేవేరులతో కలసి  తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
మోహినీ  అలంకరణలో.. మోహినీ అలంకారంలో స్వామి మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. చినవెంకన్న వైశాఖమాస బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో మోహినిగా శ్రీవారు భక్తులను కటాక్షించారు. 
బ్రహ్మోత్సవాల్లో 
నేడు ∙ఉదయం ..10 గంటలకు భక్తిరంజని
∙సాయంత్రం ..5 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శన
∙రాత్రి 7 గంటలకు ..శ్రీవారి దివ్య రథోత్సవం
∙రాత్రి 8.30 గంటల ..నుంచి అన్నమాచార్య సంకీర్తనలు
 
మరిన్ని వార్తలు