లోప భూయిష్టంగా సాగునీటి వ్యవస్థ

24 Aug, 2016 21:54 IST|Sakshi
లోప భూయిష్టంగా సాగునీటి వ్యవస్థ
 లెక్కల్లో తేడా వస్తే సస్పెన్షనే...
 విజిలెన్స్‌కు అప్పగిస్తాం...
 వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ 
కౌతవరం (గుడ్లవల్లేరు) : 
సాగునీటి వ్యవస్థ లోప భూయిష్టంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ అన్నారు. సాగునీటి సమస్యపై అధికారులతో మాట్లాడేందుకు బుధవారం కౌతవరం ఇరిగేషన్‌ బంగళాకు వచ్చిన ఆయన కాలువల్లో సాగునీటి పారుదలను పరిశీలించారు. కొందరు తమ స్వార్థం కోసం సాగునీటి వ్యవస్థను నాశనం చేశారని మంత్రి పేర్కొన్నారు. ఈ వ్యవస్థ దెబ్బతినటానికి అధికారులే కారణమని వ్యాఖ్యానించారు. రెండేళ్లలో తన శాఖ పరిధిలో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకల సమస్య వంటివి ఎన్నో ఇబ్బందులు రాగా, వాటిని స్వయంగా పరిష్కరించానని కామినేని చెప్పారు. తన నియోజకవర్గం కైకలూరుకు సాగునీరే కాదు.. తాగునీరు కూడా కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు. కాలువలకు నీటి విడుదలపై తన వంటివారు ఇలా రాకుండానే అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తమ ప్రాంతానికి విడుదల చేయాల్సిన సాగునీటి వాటా గురించి రైతుల తరఫున అడిగేందుకే వచ్చానన్నారు. ఆయకట్టును బట్టి నీరు విడుదల చేయాలని సూచించారు. 
సాగునీరు పక్కదారి...
బందరు కాలువకు కంకిపాడు–ఉయ్యూరు గేట్ల వద్ద 1,100 క్యూసెక్కుల నీటి వాటాను పక్కదారి పట్టిస్తున్నారని మంత్రికి గుడివాడ ఏఎంసీ మాజీ చైర్మన్‌ కొసరాజు వెంకటాద్రిచౌదరి తెలిపారు. బల్లిపర్రు లాకుల వద్ద రెండు గేట్లు పూర్తిగా పాడైపోయినా, వాటిని తెరవకుండా ఉంచారని చెప్పారు. వారం నుంచి తాను రైతులతో వెళ్లి అధికారులతో మాట్లాడితే ఒక గేటు తెరవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఇరిగేషన్‌ ఎస్‌ఈ, సాగునీటి మంత్రి దేవినేని ఉమాతో ఫోనులో మాట్లాడారు.
పక్షపాతం చూపొద్దు...
జిల్లా సాగునీటి ప్రాజెక్ట్‌ల కమిటీ చైర్మన్‌ గుత్తా శివరామకృష్ణ(చంటి) తన గుడివాడ ప్రాంతంపై పక్షపాతం చూపుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. గుడివాడలో తాగునీరు ఉన్నప్పటికీ ఎందుకు వందలాది మోటార్లతో నీటిని తోడుతున్నారని ప్రశ్నించారు. ఇలాగైతే సాగునీరు పక్కదారి పడుతుందనే విషయాన్ని విజిలెన్స్‌కు అప్పగిస్తామని మంత్రి చెప్పారు. కాలువలకు విడుదల చేస్తున్న నీటి విషయంలో లెక్కల్లో తేడాలు వస్తే అధికారులపై సస్పెన్షన్‌ వేటు తప్పదని హెచ్చరించారు. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, కైకలూరు ఏఎంసీ చైర్మన్‌ చింతపల్లి రాజరాజేశ్వరి, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఈడ్పుగంటి వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు