'వైద్యులు నైతిక విలువలకు కట్టుబడాలి'

18 Feb, 2016 14:42 IST|Sakshi

విజయవాడ: ఏపీ మెడికల్ కౌన్సిల్ కార్యాలయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదలకు సమగ్ర వైద్యం అందించడంతో పాటు వైద్యులు నైతిక విలువలకు కట్టుబడి ఉండటమే ప్రధాన ఉద్దేశ్యంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆర్హతలు, మెరిట్ ప్రతిపాదికన 1000 నర్సులు,501 డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.

వైద్య ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు దళారులు చెబుతున్నట్లు సమాచారం తమ వద్ద ఉన్నదని వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 'ప్రస్తుత పరిస్ధితులలో సిఫార్సుల ద్వారా నా కొడుకు, కూతురుకు కూడ ఉద్యోగం ఇప్పించుకోలేనని.. అంత పారదర్శకంగా కాంట్రాక్ట్ ఉద్యోగ నియమకాలు చేపడుతున్నాం' అని మంత్రి కామినేని వెల్లడించారు.

ఇప్పటివరకు ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల క్రింద లక్ష మందికి రోగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లుగా మంత్రి వెల్లడించారు. గర్భిణీలకు మార్చి 8 వ తేది నుండి అల్ట్రా సౌండ్ పరీక్షలను ఉచితంగా చేస్తామని తెలిపారు. త్వరలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కౌన్సిల్ సభ్యులు, పలువురు వైద్యులు పాల్గొన్నారు.
 

 

>
మరిన్ని వార్తలు