వెంకన్న తప్ప ఇంకేమీ మిగలలేదు

22 Aug, 2015 20:20 IST|Sakshi
వెంకన్న తప్ప ఇంకేమీ మిగలలేదు

రాజమండ్రి: వైద్యరంగపరంగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ ఆస్పత్రులు, పరిశోధనలతోపాటు మెరుగైన వైద్య సేవలన్నీ తెలంగాణలోనే ఉన్నాయన్నారు. నిజానికి రాష్ట్రంలో తిరుపతి వెంకన్న తప్ప ఇంకేమీ మిగలేదన్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్ మెడికల్ కళాశాలలో జరుగుతున్న అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ 38వ వార్షికోత్సవ సమ్మేళనంలో భాగంగా 'న్యూ హారిజన్స్ ఇన్ సర్జికల్ ప్రాక్టీస్' కార్యక్రమాన్ని మంత్రి కామినేని శనివారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా కూడా వెనుకబడి ఉన్న రాష్ట్రంలో వైద్యరంగాన్ని అభివృద్ధి చేసుకోవలసిన అవసరం ఉందని, ప్రైవేట్‌రంగం కలిసి వస్తే అనుకున్న అభివృద్ధిని సాధించేందుకు వీలుంటుందని అన్నారు.

 పీజీ స్థాయి వైద్యులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నియమించడం సరికాదన్నారు. ప్రజల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పట్ల నమ్మకం కలిగేలా వైద్య సేవలు అందించాలన్నారు. ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా వైద్యరంగానికి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1,300 కోట్లు కేటాయించిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న వివిధ సర్వీసులను త్వరలోనే విజయవాడకు తరలించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సర్జన్ల లోటును భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు