టీడీపీకి కమ్మ సామాజిక వర్గం షాక్‌

15 Aug, 2017 23:48 IST|Sakshi
టీడీపీకి కమ్మ సామాజిక వర్గం షాక్‌
– కార్పొరేషన్‌ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయించకపోవడంపై అగ్రహం
– ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆవేదన 
– మాజీ ఎమ్మెల్సీ భాస్కర రామారావు ఆధ్వర్యంలో సమావేశం 
– పెద్దపీట వేసిన వైఎస్సార్‌ సీపీకి ఓటేద్దామని నిర్ణయం
 సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీకి కమ్మ సామాజిక వర్గం షాకిచ్చింది. 10వేలకు పైగా ఓటర్లున్న తమ సామాజిక వర్గానికి టీడీపీ, బీజేపీ మొండిచేయి చూపాయని కమ్మ సామాజిక వర్గ నేతలు మండిపడుతున్నారు. ఒక్క డివిజన్‌ కూడా కేటాయించకుండా తమను పూర్తిగా విస్మరించారని కమ్మ సామాజిక వర్గమంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. వైఎస్సార్‌ సీపీ తమ సామాజిక వర్గానికి పెద్దపీట వేసిందని, ఆ పార్టీకే మద్దతు తెలపాలని దాదాపు నిర్ణయించుకున్నారు. 
కమ్మ సామాజికి వర్గానికి  పోటీ చేసే అవకాశాన్ని టీడీపీ ఇవ్వలేదు. వారికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. వేలాది ఓట్లు ఉన్న తమపై ఎందుకంత చిన్న చూపని ఆ సామాజిక వర్గ నేతలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం కాకినాడలోని ఎన్‌ఎఫ్‌సీఎల్‌ రోడ్డులోని ఈటూ రెస్టారెంట్‌లో కమ్మ సామాజిక వర్గ నాయకులంతా సమావేశమయ్యారు. తమకు టిక్కెట్‌ ఇవ్వకపోగా ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి ప్రవర్తన సరిగా లేదని, తమపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని సమావేశంలో ప్రస్తావించారు. ఎన్నికల్లో ప్రభావం చూపే ఓట్లు ఉన్న తమను చిన్న చూపు చూడటం సరికాదని, ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి తగ్గిన బుద్ధి చెప్పాలని సమావేశంలో నిర్ణయించారు. టీడీపీ, బీజేపీ అనుసరించిన తీరుకు నిరసనగా ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించారు. దీనిపై సమగ్రంగా చర్చించేందుకు బుధవారం మరోసారి నాగమల్లి తోట జంక‌్షన్‌ వద్ద సమావేశమవ్వాలని నిర్ణయించారు. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గుణ్ణం చంద్రమౌళి, బోళ కృష్ణమోహన్, గోళ్లమూడి అజయ్‌కుమార్, రావిపాటి రామరాయచౌదరి, గారపాటి రాయుడు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు