ఏపీ కాపు సంరక్షణ సంఘం ప్రారంభం

10 Sep, 2016 19:05 IST|Sakshi
ఏపీ కాపు సంరక్షణ సంఘం ప్రారంభం
  • కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా 
  • ఏపీ కాపు సంరక్షణ సంఘం ప్రారంభం
  • ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం):
    కాపు కులస్థులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమకార్యక్రమాలు చేపడుతున్నామని, కాపులను బీసీల్లో చేర్చేందుకు టీడీపీ ప్రభుత్వం సానుకూలంగా ఉందని కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు చెప్పారు. అలా చేర్చని పక్షంలో ఏ పార్టీకైనా పుట్టగతులు ఉండవని వ్యాఖ్యానించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ కాపు సంరక్షణ (కాపు,తెలగ,బలిజ) సంఘం ప్రారంభోత్సవం శనివారం స్థానిక గౌతమఘాట్‌లోని బొమ్మన రామచంద్రరావు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కమ్యూనిటీ హాల్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న యర్రా సంఘం లోగోను ఆవిష్కరించారు. కాపు కార్పొరేషన్‌ ద్వారా అందిస్తున్న రుణాలకు బ్యాంకర్లు సహకరించకపోవడం వలన ఈ పథకం విషయంలో విఫలమవుతున్నామన్నారు.

    కాపుల అభ్యున్నతికి నూతన సంఘం ఇచ్చే సలహాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. సంఘం అధ్యక్షుడు వడ్డి మల్లిఖార్జున్‌ మాట్లాడుతూ స్వచ్ఛందంగా రాష్ట్రంలోని విద్యావంతులతో ఏర్పాటైన సంఘం ద్వారా కాపు జాతిని చైతన్యపరిచేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం కాపులకు 20 ఏళ్ళ వరకు ఉచిత విద్యను అందించాలని, కాపు విద్యార్థి, యువతీ,యువకులకు వ్యవసాయ, వృత్తి, సేవా కార్యక్రమాలలో శిక్షణ ఇప్పించాలని,కాపురుణాలను బ్యాంకులతో ముడిపెట్టకుండా కాపు కార్పొరేషన్‌ ద్వారా నేరుగా అందించాలని డిమాండ్‌ చేశారు. కాపునేత వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ వంగవీటి రంగా మృతి అనంతరం కాపులను ఒక తాటిపైకి తీసుకువచ్చే నాయకుడే కరువయ్యాడన్నారు. కాపుల సంఘాలను, నాయకులను ఒక తాటిపైకి తెచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. సంఘం కార్యదర్శి అనుకుల రమేష్‌ మాట్లాడుతూ తుని కేసులో యావత్తు కాపుజాతిని నిందించాల్సిన పనిలేదని, కాపు కార్పొరేషన్‌కు కేటాయించే రూ.1,000 కోట్లలో ఆరోజు కలిగిన నష్టం ఆరుకోట్లను తీసుకుని, కాపులపై అన్యాయంగా పెడుతున్న కేసులను ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. సంఘం ఉపాధ్యక్షుడు, నవోదయంపార్టీ అధ్యక్షుడు నల్లకవిజయరాజు, జిల్లా చాంబర్‌ కామర్స్‌ అధ్యక్షుడు, నగర కాపు సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నందెపు శ్రీనివాస్, మాజీ కార్పోరేటర్‌ మంచాల బాబ్జీ, సంఘం సెక్రటరీ తాడికొండ విజయలక్ష్మి, రాష్ట్రయూత్‌ ప్రెసిడెంట్‌ వెలిశెట్టి శ్రీహరిరావు(రాయులు), ప్రధానకార్యదర్శి రాయవరపు పెదబాబు, హజరయ్యలు మాట్లాడుతూ కాపులు రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం వడ్డి మల్లిఖార్జున్‌ రచించిన ‘కాపు ప్రస్థానం’ పుస్తకాన్ని ముఖ్యఅతిథి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు పురంశెట్టి మంగారావు, కాపునేతలు మారిశెట్టి రామారావు, అర్లపల్లి బోస్, జిల్లా యూత్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు బోడా వెంకట్, కొల్లిమళ్ళ రఘు, వడ్డిమురళి, ప్రకాష్, ముద్దాల అను, పడాలశ్రీనివాస్, దొండపాటి సత్యంబాబు, రాయవరపు చినబాబు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు