ముద్రగడ వెంటే మేమంతా

25 Jul, 2017 23:25 IST|Sakshi
ముద్రగడ వెంటే మేమంతా
అరచేతిని అడ్డుపెట్టి ఉద్యమాన్ని ఆపలేరు
పాదయాత్ర జరిగి తీరుతుంది 
కాపు జేఏసీ నాయకులు
కిర్లంపూడి (జగ్గంపేట) : అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఏ విధంగా ఆపలేరో పోలీసులను అడ్డుపెట్టి ముద్రగడ పాదయాత్రను ఆపలేరని, ఆరు నూరైనా పాదయాత్ర జరిగి తీరుతుందని కాపు జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం ముద్రగడ స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, ఆరేటి ప్రకాష్, సంగిశెట్టి అశోక్, తుమ్మలపల్లి రమేష్‌ తదితరులు మాట్లాడుతూ ముద్రగడ వెంట ఎవరూ లేరని కొందరు తెలుగుదేశం మంత్రులు మాట్లాడుతున్నారని ముద్రగడ వెంట ఎవరూ లేకపోతే పాదయాత్రను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో పోలీసు పికెట్‌లు ఎందుకు పెట్టారని, కిర్లంపూడిలో వేలమంది పోలీసు బలగాలను ఎందుకు మొహరింపజేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీల అమలు గుర్తు చేయడం కోసం తమ నాయకుడు రోడ్డెక్కి పాదయాత్ర నిర్వహించ తలపెడితే పోలీసులను అడ్డుపెట్టుకుని ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తారా అని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల్లో పబ్లిసిటీ కోసం 30 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆ తరువాత కృష్ణా పుష్కరాలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. తుని రైల్వే సంఘటన కాపులకు సంబంధం లేదని 2016 ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పత్రికా ముఖంగా తెలిపారని, అప్పటి పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడు కిర్లంపూడి వచ్చి ఆరు నెలల్లో కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారన్నారు. ఇచ్చిన గడువు పూర్తయ్యింది, మరో ఏడాది కావస్తుంది ఇచ్చిన హామీలను గుర్తు చేయడం కోసం పాదయాత్ర చేస్తుంటే తమ జాతిని అణగ దొక్కేందుకు బైండోవర్‌ కేసులు బలవంతపు సంతకాలు తీసుకుని భయాందోళనలకు గురి చేస్తున్నారన్నారు. మంజునాథ కమిషన్‌ రిపోర్టు అడిగే హక్కు ప్రభుత్వానికి లేదని మాట్లాడుతున్నారు. కమిషన్‌ను ప్రభుత్వం నియమించిందా, ప్రభుత్వాన్ని కమిషన్‌ ఏర్పాటు చేసిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నో కమీషన్‌లు ఏర్పాటు చేశారు ఐదారు నెలల కాలంలో రిపోర్టులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి, కాపుల కోసం వేసిన కమీషన్‌ 18 నెలలు దాటినా అతీగతీ లేదన్నారు. సహనం పాటించాల్సిన ప్రభుత్వం 26న పాదయాత్రకు పిలిపిస్తే వారం రోజుల ముందుగానే బైండోవర్‌ కేసులు, అరెస్టులకు పాల్పడుతుందన్నారు. కాపు జాతి ఏం పాపం చేసుకుంది, మేమేమన్నా దొంగలమా, ఉగ్రవాదులమా అన్నారు. జీఓ నంబర్‌ 30ని అమలు చేయమని అడుగుతుంటే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సెక‌్షన్‌ 30, 144లు అమలు చేసి వేలాది మంది కాపుల మీద కేసులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. 1994లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అప్పట్లో తమపై పెట్టిన కేసులు అన్యాయమని ఖండించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తరువాత కేసులు కొట్టివేశారన్నారు. పదేళ్ల అధికారంలో కాపులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అడుగుతుంటే కేసులు పెట్టి అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తుని ఐక్యగర్జనకు హాజరై ఆ నాడు మద్దతు తెలిపిన నాయకులు పార్టీ మారిన తరువాత వారి తీరు మారిందని విమర్శించారు. ప్రభుత్వం, పోలీసులు ఏకమై అత్యుత్యాహం ప్రదర్శించి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారన్నారు. దమ్ముంటే ముద్రగడను విమర్శించే మంత్రులు, ఎమ్మెల్యేలు కాపులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని చంద్రబాబును డిమాండ్‌ చేయాలని హితవు పలికారు. జేఏసీ నాయకులు తోట రాజీవ్, నడిశెట్టి సోమేశ్వరరావు, గౌతు స్వామి, చల్లా సత్యన్నారాయణ, తోట బాబు, మండపాక చలపతి, రాపేటి పెద్ద, ఇంటి రాజా, కురుమళ్ల చిన్ని తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు